తెదేపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరాధారమయిన ఆరోపణలు, అసత్య కధనాలు ప్రచురిస్తున్న సాక్షి మీడియాను స్వాధీనం చేసుకొంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా చెప్పారు. అయినప్పటికీ జగన్ ఏమాత్రం చలించలేదు పైగా సాక్షి మీడియాలో ప్రభుత్వంపై ఇంకా తీవ్రమయిన ఆరోపణలు ప్రచురిస్తోంది. కనుక చంద్రబాబు నాయుడు హెచ్చరించినట్లుగానే సాక్షి మీడియాపై చర్యలకు ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టినట్లుంది.
గుంటూరు జిల్లాలోని పొన్నూరు తెదేపా ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్ర ఇవ్వాళ్ళ సాక్షి ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియాపై పొన్నూరు గ్రామీణ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసారు. ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేస్తున్నందుకు దానిపై తగిన చర్యలు తీసుకోవలసిందిగా అయన తన పిర్యాదులో కోరారు. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే, ప్రభుత్వం తరపున పిర్యాదు చేస్తే దానిని తేలికగా తీసుకోవడానికి కుదరదు కనుక పోలీసులు వెంటనే 12 మందిపై కేసులు నమోదు చేశారు. కనుక ఇక ఈ వ్యవహారంపై కూడా తెదేపా-వైకాపాల మధ్య తీవ్ర వాగ్వాదాలు మొదలవవచ్చును.
వైకాపాకి, దాని అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి సాక్షి మీడియా కవచకుండలాల వంటివని చెప్పవచ్చును. అవి ఉన్నంత వరకు అతనిని, వైకాపాని నిలువరించడం చాలా కష్టం కనుకనే ప్రభుత్వం ఆ కవచకుండలాలను తీసేసుకొని ఈ రాజకీయ కురుక్షేత్ర రణరంగంలో జగన్మోహన్ రెడ్డిని బలహీనుడిని చేయాలని భావిస్తున్నట్లుంది. ఒకవేళ అదే జరిగితే, అందుకు ప్రభుత్వాన్ని నిందించడం కంటే జగన్ తనను తానే నిందించుకోవలసి ఉంటుంది. ఎందుకంటే అది కూడా స్వయంకృతాపరాధమే కనుక. బలమయిన మీడియా చేతిలో ఉన్నప్పటికీ దానికీ కొన్ని హద్దులు, నియమ నిబంధనలు ఉంటాయనే సంగతిని జగన్ పట్టించుకోకుండా దానిని ఆయుధంగా ఉపయోగించుకొని ప్రభుత్వాన్ని దెబ్బ తీయాలని ప్రయత్నిస్తునందునే ఈ సమస్య తలెత్తుతోంది. కనుక ఒకవేళ సాక్షి మీడియా ఇబ్బందులలో పడితే దానికి జగనే బాధ్యుడనుకోవలసి ఉంటుంది.