చిరంజీవి జీవితం స్ఫూర్తి మంత్రం. స్వయం కృషితో చిరు ఎదిగిన విధానం భవిష్యత్తు తరానికి విలువైన పాఠం. చిరు జీవితంలో ఒడిదుడుకులు ఎన్నో ఉన్నాయి. వాటిలో అభిమానులకు కొన్నే తెలుసు. చిరు జీవితంలోని ప్రతి అక్షరాన్నీ చదవాలని, ప్రతి పేజీనీ తిప్పాలని అందరూ అనుకోవడం సజహం. మరి చిరు సమస్త జీవన ప్రయాణాన్ని తెలిపే ఆ బయోగ్రఫీ ఎప్పుడొస్తుంది? ఎవరు రాస్తారు?
ఈ ప్రశ్నలకు సమాధానం చిరు చెప్పేశారు. తన జీవితాన్ని అక్షరబద్ధం చేసే బాధ్యత ఆయన యండమూరి వీరేంద్రనాథ్ కి అప్పగించారు. తన జీవితాన్ని ఆటో బయోగ్రఫీ పేరుతో రాసుకొనే తీరిక తనకు లేదని, ఆ బాధ్యతని యండమూరి అయితే సమర్థవంతంగా నిర్వర్తించగలడని చిరు ఓ సభలో పేర్కొన్నారు. చిరంజీవి జీవితాన్ని అక్షరబద్ధం చేసే బాధ్యత యండమూరికి అప్పగిస్తే అంతకంటే కావల్సింది ఏముంది? చిరు తొలి అడుగులు వేస్తున్నప్పుడు యండమూరి ఆయనతోనే ఉన్నారు. యండమూరి రాసిన ఎన్నో నవలా చిత్రాలకు చిరంజీవినే కథానాయకుడు. ఇద్దరి మధ్యా మంచి స్నేహం ఉంది. అందుకే చిరు ఆబాధ్యత యండమూరికి అప్పగించారు. యండమూరి చేయి తిరిగిన రచయిత. మాంచి కమర్షియల్ రైటర్. ఎలాంటి విషయాన్నయినా పాఠకులు చదివేలా రాయగలరు. చిరంజీవి కథ అంటేనే కమర్షియల్ సినిమాకి ఉండాల్సిన మసాలా ఉంటుంది. దాన్ని యండమూరి రాస్తే ఇక తిరుగేముంది?
నిజానికి ఇది యండమూరి కూడా ఊహించి ఉండడు. ఎందుకంటే కొంతకాలంగా యండమూరికీ మెగా కుటుంబానికీ కోల్డ్ వార్ నడుస్తోంది. చిరంజీవి రాజకీయాలకు పని చేయడు అంటూ అప్పట్లో బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చాడు యండమూరి. ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకొని హీరోలు అయిపోతున్నారంటూ పరోక్షంగా మెగా హీరోల్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. నాగేంద్రబాబు సైతం యండమూరి వ్యాఖ్యాల్ని ప్రత్యక్షంగా తూర్పారబట్టాడు. అయినా సరే – అవన్నీ మర్చిపోయి, ఓ రచయితగా యండమూరికి తాను ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇచ్చేశాడు చిరు. అజాతశత్రువు అంటే అంతేగా!