పార్టీలో చేరుతామంటూ వస్తున్న వారికి టీడీపీ, జనసేన రెడ్ కార్పెట్ వేయడం లేదు. పొటెన్షియల్ అనుకున్న వారికి మాత్రమే టిక్కెట్లు ఇస్తామని… పార్టీలోకి వచ్చి తమకు టిక్కెట్ ఇవ్వాల్సిందేనని ఒత్తిడి చేసే వ్యక్తులు అవసరం లేదని అనుకుుంటున్నారు. అదే విషయాన్ని ముందుగానే చెబుతున్నారు.
జగన్ రెడ్డి కొంత మంది కోవర్టుల్ని టీడీపీ, జనసేనల్లోకి పంపే ప్రయత్నాలు చేస్తున్నారని అక్కడ టిక్కెట్ల కోసం లొల్లి చేసి.. ఇవ్వకపోతే తీవ్ర ఆరోపణలు చేసి మళ్లీ వైసీపీలో చేరే ప్రణాళికలు అమలు చేస్తున్నారని భావిస్తున్నారు. ముఖ్యంగా కాపు సామాజికవర్గ నేతలను ఇలా ప్రయోగిస్తున్నారన్న అనుమానాలు ఉన్నాయి. ఈ క్రమంలో టీడీపీ, జనసేన కూటమి అప్రమత్తమయింది. పార్టీలో చేరేందుకు వస్తామంటే.. అన్ని విధాలుగా పరిశీలిస్తున్నారు. వారికి ఎలాంటి హామీ ఇవ్వడం లేదు.
తాజాగా ఎంపీ వల్లభనేని బాలశౌరి పవన్ తో భేటీ అయ్యారు. పార్టీలో చేరాలంటే చేరవచ్చు కానీ పోటీకి టిక్కెట్ విషయం మాత్రం తాను ఏ హామీ ఇవ్వలేనని పవన్ తేల్చేసినట్లుగా చెబుతున్నారు. జగన్ రెడ్డి బినామీల్లో ఒకరిగా పేరున్న బాలశౌరి వైసీపీకి రాజీనామా చేయడమే ఆశ్చర్యం అయితే..తనకు తానుగా జనసేనలో చేరుతున్నానని ప్రకటన చేసుకున్నారు. దీంతో ఆయన విషయంలో మరింత కేర్ ఫుల్ గా ఉండాలని అనుకుంటున్నారు.
అలాగే టీడీపీలో చేరుతున్న కొంత మంది నేతల విషయంలోనూ ఇదే పంథా అవలంభిస్తున్నారు. టిక్కెట్లు ఇచ్చే నేతలకు ఇస్తాం కానీ అందరికీ కాదని నేరుగానే చెప్పేస్తున్నారు. చేరితే చేరండి లేకపోతే లేదని అంటున్నారు.