తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడి నెలన్నర కూడా కాలేదు. అప్పుడే కేటీఆర్ యుద్ధం ప్రకటించేశారు. వంద రోజుల్లో అమల్లోకి తెస్తామని చెప్పిన హామీల్ని అమలు చేయడం లేదని ఫైరవుతున్నారు. పదేళ్ల పాటు అధికారంలో ఉండి .. ఎన్నో హామీల్ని అమలు చేయని బీఆర్ఎస్ ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడగానే ఎందుకు ఇంత హడావుడి చేస్తుందన్న సందేహాలు సామాన్యుల్లో వస్తాయి. అయినా కేటీఆర్ తగ్గడం లేదు.
అయితే కేటీఆర్ భయాలు కేటీఆర్ కు ఉన్నాయని బీఆర్ఎస్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. జమిలీ ఎన్నికలు వద్దనుకున్న కేసీఆర్ గతంలో ఆరు నెలల ముందుగా అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లారు. ఇప్పుడు అదే పెద్ద సమస్యగా మారింది. అసెంబ్లీ ఎన్నిక్లలో ఓడిపోయిన వెంటనే పార్లమెంట్ ఎన్నికలు ఎదుర్కోవాల్సి వస్తోంది. గతంం కంటే బీజేపీ మెరుగ్గా ఉంది. జాతీయ స్థాయి అంశాలపై ఓటింగ్ జరగడం ఖాయంగా మారింది. రెండు జాతీయ పార్టీల మధ్య బీఆర్ఎస్ తన పోరాటాన్ని కొనసాగించడం అంత తేలిక కాదు. అసలు బీఆర్ఎస్ ప్రస్తావన లేకుండా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా పోలింగ్ సాగితే బీఆర్ఎస్ ఘోరమైన ఫలితాల్ని చూడాల్సి వస్తుంది. అదే జరిగితే పార్టీ ఉనికి కష్టమవుతుంది.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినందుకే స్థానిక క్యాడర్ కాంగ్రెస్ బాట పడుతున్నారు. మన్సిపాలిటీలు, స్థానిక సంస్థల్లో ఉన్న క్యాడర్ అంతా కాంగ్రెస్ వైపు పరుగులు పెడుతున్నారు. వారిని ఆపడం బీఆర్ఎస్ పెద్దలకు సాధ్యం కావడం లేదు. రేపు పార్లమెంట్ ఎన్నికల్లో గత ఎన్నికల్లో సాధించిన సీట్లు అయినా సాధించకపోతే బీఆర్ఎస్ పార్టీని ఫోర్స్ గా నడపడం సాధ్యం కాదు. వలసలు పెరిగిపోతాయి. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ బీఆర్ఎస్ నేతల్ని పంచుకునే ప్రమాదం ఉంది. బీఆర్ఎస్ మళ్లీ పుంజుకోవడం కష్టమన్న్ భావనకు వస్తే ఆ పార్టీలోని నేతలంతా తలోదారి చూసుకుంటారు. అందుకే.. ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో ఖచ్చితంగా మెరుగైన ఫలితాల్ని సాధించాల్సిన అవసరం ఏర్పడింది. అందుకే సమయం కూడా ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ పోరాటం ప్రారంభించిందన్న వాదన వినిపిస్తోంది.