తిరుపతి ఉపఎన్నికల సమయంలో చేసిన దొంగ ఓట్ల అక్రమాలకు సివిల్ సర్వీస్ అధికారులు బలైపోతున్నారు. తాజాగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో జరిగిన అక్రమాలపైనా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల జాబితా రూపకల్పనలో భయంకరమైన తప్పులు జరిగాయి. అది కూడా తిరుపతి కేంద్రంగానే జరిగింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికారుల సహకారంతో అధికార పార్టీ నేతలు అక్రమాలకు పాల్పడ్డారు. గ్రాడ్యుయేట్లు కానివారిని సైతం గ్రాడ్యుయేట్లుగా ఓటు హక్కు కల్పించి బోగస్ ఓట్లు వేసుకున్నారు.
గ్రాడ్యుయేట్ ఎన్నికల అక్రమాలపై ప్రతీ ఫిర్యాదుతోపాటు ఆధారాలను సైతం ఎలక్షన్ కమిషన్కు గతంలో టీడీపీతో పాటు ఇతర అభ్యర్థులు పంపారు. ఒక్క ఫిర్యాదుపై మాత్రం ఐపీసీ సెక్షన్ 171 డీ, రిప్రజెంటేషన్ ఆప్ పీపుల్స్ యాక్ట్ – 1950 ప్రకారం ఇద్దరు తిరుపతి మునిసిపల్ కార్పొరేటర్లపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేు. దొంగ సర్టిఫికేట్లతో గ్రాడ్యుయేట్లుగా సర్టిఫై చేసి ఓటు హక్కు కల్పించిన ఈఆర్ఓ, ఏఈఆర్ఓలుపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు.
ఇప్పుడు ఆ కేసులతో పాటు.. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. ఈసీకి రిమైండర్స్ పంపుతున్నారు. గ్రాడ్యుయేట్ ఎన్నికలతో పాటు అన్ని ఎన్నికల్లో అధికార పార్టీ అక్రమాలకు సహకరించిన ప్రతీ అధికారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ అంశంపైనా ఈసీ దృష్టి పెడితే.. మరో నాలుగురు, ఐదుగురు ఐపీఎస్, ఐఏఎస్ అధికారుల ఇంటికి పోవాల్సి ఉంటుందన్న అభిప్రాయం వినిపిస్తోంది.