పదేళ్ల కిందట కాదు.. ఐదేళ్ల కిందట బీజేపీ రెండో సారి గెలిచిన తర్వాత కూడా అయోధ్య రామ మందిరం ఇష్యూకి ముగింపు లభిస్తుందని ఎవరూ అనుకోలేదు. ఎందుకంటే సమస్య అలాంటిది. రాజకీయంగా సున్నితమైనది. ఈ సమస్యకు పరిష్కారం లభించే అవకాశం ఉన్నా రాజకీయపార్టీలు అంగీకరిచబోవని అలా వివాదం చేస్తూ ఉంటేనే వాటికి మనుగడ ఉంటుందని చాలామంది అనుకుంటూ ఉండేవారు. కానీ ప్రధాని మోదీ చాకచక్యంగా సమస్యను పరిష్కరించారు. ఎలాంటి వివాదాలు లేకుండా ఆలయాన్ని నిర్మిస్తున్నారు. ప్రారంభిస్తున్నారు. ఇదంతా నిస్సందేహంగా మోదీ ఘనతే.
అయోధ్య అలయ నిర్మాణం మోదీ సంకల్పం
32 ఏళ్ల క్రితం నరేంద్ర మోదీ అయోధ్యని సందర్శించారు. రామ్ లల్లా అప్పటికి ఓ టెంట్‌లో ఉన్నాడు. ఆ విగ్రహాన్ని చాలా సేపు తదేకంగా చూశారట మోదీ. ఆ సమయంలో “రాముడికి గుడి కట్టిన తరవాతే ఈ నేలపై అడుగు పెడతాను” అని ప్రతిజ్ఞ చేసుకున్నారట. అలా తన 30 ఏళ్ల పంతాన్ని నెగ్గించుకుని జనవరి 22న జరగనున్న అయోధ్య రామ ప్రాణ ప్రతిష్ఠకు హాజరు కానున్నారు నరేంద్ర మోదీ. కేవలం ఈ మహత్తర ఘట్టంలో పాలు పంచుకునేందుకే దేవుడు తనకీ జన్మనిచ్చాడేమో అంటూ మొన్నామధ్య భావోద్వేగానికి లోనయ్యారు. తనను తాను హిందూవాదిగా ఎప్పుడూ చెప్పుకోకపోయినప్పటికీ…ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న హిందువులు మోదీనే తమ ప్రతినిధిగా భావిస్తున్నారు.
అయోధ్య సమస్యకు సామరస్య పరిష్కారం
అయోధ్య సమస్య దేశం మొత్తం అట్టుడికిపోవడానికి కారణమైన సమస్య. ఎలాంటి వివాదాలు లేకుండా. ఎవరికీ అసంతృప్తి లేకుండా పరిష్కారం అవుతుందని ఎవరూ అనుకోలేదు. కానీ అయింది. సుప్రీకోర్టు తీర్పును అందరూ అంగీకరించారు. చారిత్రక ఆధారాలను బట్టి తీర్పు ఇచ్చారు. ముస్లిం వర్గానికీ అన్యాయం జరగకుండా స్థలం ఇచ్చారు. దీంతో అందరూ సంతృప్తి చెందారు. పట్టి పీడించిన ఓ సమస్యకు పరిష్కారం లభించడ మే కాదు.. దేశ హిందువుల కలను నెరవేరుస్తున్నారు.
బీజేపీ మార్క్ హిందూత్వాన్ని ఆమోదయోగ్యంగా మార్చిన మోదీ
ఎవరేమనుకున్నా మోదీ హిందూత్వ వాదినే. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఆలయాల రూపురేఖలు మార్చేయడం. అందుకోసం పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం. అన్నింటి కన్నా అయోధ్య రామ మందిరాన్ని నిర్మించేందుకు ప్రత్యేక చొరవ చూపించడం. ఇవే ప్రధాని మోదీ ఆదరణను అమాంతం పెంచింది. “మోదీ హయాంలో అయోధ్య రాముడి గుడి కట్టారు” అని వచ్చే తరాలు చెప్పుకుంటాయి. సనాతన ధర్మాన్ని పరిరక్షించడమే తమ ఎజెండాగా చెప్పే బీజేపీకి పొలిటికల్‌గానే కాకుండా సైద్ధాంతికంగా కూడా ఇది చరిష్మాని పెంచే కీలక పరిణామం ఇది. అయోధ్య ఆలయాన్నీ రాజకీయాల కోసం వాడుకుంటున్నారన్న విమర్శలు వస్తున్నా వాటిని పట్టించుకోకుండా ఘనంగా ఈ వేడుకని నిర్వహించేందుకు సిద్ధమైంది మోదీ సర్కార్.