మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గ సమీక్ష జరుగుతూంటే.. పార్టీ నేతల్ని తీసుకుని దుబాయ్ వెళ్లిపోయారు ఎమ్మెల్యే మల్లారెడ్డి., పార్టీ ఆదేశిస్తే మల్కాజిగిరి నుంచి పోటీ చేస్తానని ఆయన ప్రకటించారు తీరా.. సమీక్షా సమావేశం జరిగే సమయానికి అందుబాటులోకి లేకుండా వెళ్లిపోయారు. సమీక్షా సమావేశం షెడ్యూల్ ప్రకటించిన నెల రోజులపైనే అవుతుంది. అంటే ఉద్దేశపూర్వకంగానే మల్లారెడ్డి సమీక్షకు డుమ్మా కొట్టారు. తనతో పాటు తన క్యాడర్ కూడా వెళ్లకుండా కట్టడి చేశారు.
మల్కాజిగిరి లోక్ సభ స్థానంపై బీఆర్ఎస్ పార్టీ సమీక్షా సమావేశాన్ని మల్లారెడ్డి లేని కారణంగానే వాయిదా వేశారు. బీఆర్ఎస్ నేతలు ఈ సమీక్షను వాయిదా వేయాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కోరగా అందుకు అంగీకరించినట్లు తెలిసింది. పార్టీ సమీక్ష ఉందని ముందే తెలిసినా మల్లారెడ్డి అందుబాటులో లేకపోవడంపై కేటీఆర్ ఫైర్ అయినట్లు సమాచారం. కానీ మల్లారెడ్డి తీరు గురించి తెలిసిన తర్వాత కూడా ఆయన లేడని పార్టీ సమీక్ష వాయిదా వేయడం ఏమిటని ఇతర నేతలు అసంతృప్తికి గురయ్యారు.
మల్లారెడ్డి బీఆర్ఎస్ ఓడిపోయినప్పటి నుంచి తేడాగానే ప్రవర్తిస్తున్నారు. అసెంబ్లీ లాబీల్లో కాంగ్రెస్ కు మద్దతిస్తానని ప్రకటించారు. రేవంత్ రెడ్డి తనకు స్నేహితుడని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ కు దూరంగా జరుగుతున్నారు. అయితే మల్కాజిగిరి పరిధిలో మల్లారెడ్డి కంటే బలమైన నేత లేడనుకుని.. ఆయనను బతిమాలుకోవాల్సిన పరిస్థితుల్లోకి బీఆర్ఎస్ వచ్చినట్లుగా కనిపిస్తోంది.