జగన్ రెడ్డి వ్యాపార భాగస్వామి, బినామీగా పేరు ఉన్న వల్లభనేని బాలశౌరి జనసేన పార్టీలో చేరుకుండానే తన హిడెన్ అజెండాను అమలు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. తనకు తాను మచిలీపట్నం లోక్ సభ టిక్కెట్ ను ప్రకటించేసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో తాను ఆ స్థానం నుంచే పోటీ చేస్తానని చెప్పుకున్నారు. పవన్ వల్లే పోలవరం పూర్తవుతుందని చెప్పుకొచ్చారు. కానీ జగన్ రెడ్డిని మాత్రం పల్లెత్తు మాట అనడం లేదు.
బాలశౌరి వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లుగా.. జనసేనలో చేరుతున్నట్లుగా సోషల్ మీడియాలో ప్రకటించుకున్నారు. తర్వాత మూడు రోజులకు పవన్ కల్యాణ్ ను కలిశారు. కానీ పార్టీలో చేరాలని పవన్ ఆహ్వానించారో లేదో స్పష్టత లేదు. బాలశౌరి కూడా తర్వాత చెబుతానన్నారు. ఈ విషయంలో జనసేన పార్టీ నుంచి కూడా స్పష్టత లేదు. కానీ బాలశౌరి మాత్రం.. ప్రకటనలు ప్రారంభించారు.
అదే సమయంలో పార్టీలో చేరేందుకు వచ్చిన కొణతాల రామకృష్ణను పవన్ సాదరంగా ఆహ్వానించారు. ఆయన ఇవాళ అనకాపల్లిలో అనుచరులతో సమావేశం పెట్టి జనసేనలో చేరుతున్నట్లుగా ప్రకటించగానే.. పవన్ కల్యాణ్ కూడా స్పందించారు. కొణతాల వంటి నేతల అవసరం పార్టీకి ఉందన్నారు. కానీ బాలశౌరి విషయంలో పవన్ ఎలాంటి స్పందన వ్యక్తం చేయ.లేదు. ఆయన మాత్రం .. ప్రకటనలు చేసేసుకుంటున్నారు.
జగన్ రెడ్డి కొంత మంది నేతల్ని ఉద్దేశపూర్వకంగా జనసేనలోకి పంపుతున్నారన్న అనుమానాలు రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతున్న సమయంలో…. వల్లభనేని బాలశౌరి వ్యవహారం హాట్ టాపిక్ గా మారుతోంది.