బీఆర్ఎస్ పార్టీ నేతలు ప్రతిపక్ష పాత్రలోకి చురుగ్గా మారిపోతున్నారు. అయితే ప్రభుత్వానికి సమయం ఇవ్వకుండా విమర్శలు చేస్తే తమపై విమర్శలు వస్తాయని తెలిసినా పార్లమెంట్ ఎన్నికలు ఉండటంతో తగ్గడం లేదు. కేటీఆర్ కరెంట్ బిల్లులు కట్టవద్దని పిలుపునిస్తూంటే.. కవిత పూలే విగ్రహం పేరుతో కొత్త రాజకీయం ప్రారంభించారు . ఆదివారం హఠాత్తుగా అసెంబ్లీలో పూలే విగ్రహం పెట్టాలంటూ.. స్పీకర్ ను కలిసి వినతి పత్రం ఇచ్చారు. పెట్టకపోతే ఉద్యమం చేస్తామని ప్రకటించేశారు. తెలంగాణ రాజకీయాల్లో పూలే విగ్రహ అంశంపై కొత్త వివాదం ప్రారంభమయింది.
మొదట కవిత అసెంబ్లీలో మహాత్మా జ్యోతిరావుపూలే విగ్రహం పెట్టాలని స్పీకర్ కు వినతి పత్రం ఇచ్చారు. తర్వాత సోషల్ మీడియాలో డిమాండ్ చేశారు. ఈ అంశంపై మంత్రి పొన్నం కవితపై విమర్శలు చేయడంతో రాజకీయం ప్రారంభమయింది. ఏప్రిల్ 11న పూలే జయంతి లోపు స్పీకర్, ప్రభుత్వం స్పందించి సానుకూల నిర్ణయం తీసుకోవాలన్నారు. బీసీ ప్రముఖులతో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. కవిత డిమాండ్ పై రేవంత్ కేబినెట్ లోని బీసీ మంత్రి స్పందించారు. పదేళ్లు అధికారంలో ఉన్నారు కదా ఎందుకు పూలే గుర్తుకు రాలేదని పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. బీసీలకు మీ పార్టీలో ఎక్కడైనా ఏదైనా ఓ పదవి స్తే చూపించాలని సవాల్చేశారు.
అయితే పొన్నం రాజకీయం చేస్తున్నారని.. భారత జాగృతి తరపున డిమాండ్ చేశామని.. గతంలో అంబేద్కర్ విగ్రహం పెట్టించామన్నారు. అసెంబ్లీలో బడుగులకు స్థానం ఇవ్వరా అని ప్రశ్నించారు. ఈ అంశంపై కవిత వరుస కార్యక్రమాలను ఖరారు చేసుకోవడంతో రాజకీయ వివాదంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. కవిత డిమాండ్ చూస్తే ఎవరికైనా పదేళ్ల పాటు ఉన్నారు కదా.. కాంగ్రెస్ వచ్చిన నెలలోనే ఎందుకు గుర్తుకు వచ్చింది.. అప్పుడే పెట్టవచ్చు కదా అనేది ఎక్కువ మందికి వచ్చే సందేహం.