కేసీఆర్ పై ప్రజల్లో సానుభూతి వెల్లువలా ఉంది ..ఈ పరిస్థితి ని పార్లమెంటు ఎన్నికల్లో సానుకూలంగా మలచుకోవాలని పార్టీ నేతలకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. లోక్ సభ నియోజకవర్గాల వారీగా నిర్వహిస్తున్న సమక్షా సమావేశాల్లో విచిత్రమైన ప్రకటనలు చేస్తున్న కేటీఆర్ తాజాగా నల్లగొండ నేతలకు ఈ సలహా ఇచ్చారు. కేసీఆర్ పై ప్రజల్లో సానుభూతి ఎందుకు ఉంటుందని.. దాన్ని ఎలా ఉపయోగించుకోవాలని పార్టీ నేతలకు అర్థం కాలేదు.
ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ ను ఓడించారు. ప్రజలే ఓడించారు.. మరి ప్రజలు ఎందుకు సానుభూతి చూపిస్తారు. ఎన్నికల్లో ఓడిపోయారని సానుభూతి చూపిస్తారా లేకపోతే గాయపడినందుకు చూపిస్తారా అన్నది మాత్రం కేటీఆర్ చెప్పలేదు. బహుశా కేటీఆర్ ఉద్దేశం.. కేసీఆర్ సీఎంగా లేరని ప్రజలు బాధపడుతున్నారని.. ఆయన సీఎంగా ఉండాల్సిందని అనుకుంటున్నారని కావొచ్చంటున్నారు. సమీక్షా సమావేశాల్లో కేటీఆర్ ఇదే చెబుతున్నారు. కేసీఆర్ సీఎంగా లేరనిప్రజలు బాధపడుతున్నారని.. ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా ఓట్లేసినందునే కేసీఆర్ ఓడిపోయారని అంటున్నారు. ఆ పద్దతిలోనే ఈ కామెంట్స్ చేసినట్లుగా కనిపిస్తోంది. లోక్సభ ఎన్నికల్లో ఎలాగైనా మళ్లీ పుంజుకోవాలని కేటీఆర్ చాలా ప్రయత్నాలు చేస్తున్నారు.
ఏ కాంబినేషన్ తో ట్రై చేద్దామా అని చూస్తున్నారు. తెలంగాణ గళం బీఆర్ఎస్ అని చెప్పేందుకు ప్రయత్నించారు. కానీ పార్టీని బీఆర్ఎస్ గా మార్చిన అంశం ఇంకా తెరపైనే ఉంది. ఇప్పుడు సానుభూతి అంశాన్ని తెరపైకి తెస్తున్నారు. నిజంగా కేసీఆర్ పై సానుభూతి ఉంటే పరిస్థితి వేరుగా ఉంటందని .. బీఆర్ఎస్ నేతలు కూడా లెక్కలేసుకుంటున్నారు.