లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. నియోజవకర్గాల సమీక్షలో కూడా అభ్యర్థులపై కనీసం హింట్ ఇవ్వలేకపోతున్నారు. చివరికి మెదక్ నుంచి కేసీఆర్ , నిజామాబాద్ నుంచి కవిత పేర్లను కూడా ప్రకటించలేదు. వారిద్దరూ పోటీ చేయడం లేదని తేలిపోయింది. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి 9 మంది లోకసభ సభ్యులు ఉన్నారు. వీరిలో ఇద్దరు, ముగ్గురు మాత్రమే పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. సిట్టింగుల్లో పలువురు ఎంపీలకు వ్యాపారాలు ఉండటంతో గులాబీ దళంలో అనుమానాలు ఎక్కువయ్యాయి.
అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన పరాజయం, గత ఐదేళ్లలో ఎంపీలుగా ఎదురైన అనుభవంతో కొందరు పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకుంటే.. మరికొందరు జాతీయ పార్టీలతో టచ్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు విడివిడిగా జరగాలని కోరుకోవడమే బీఆర్ఎస్ పార్టీకి ముప్పుతిప్పలు తెచ్చి పెడుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన మూడు నెలలకే మళ్లీ లోక్ సభ ఎన్నికల యుద్ధం చేయాల్సి వస్తోంది. అదీ కూడా రెండు జాతీయ పార్టీలతో. లోక్ సభ ఎన్నికలంటే జాతీయ పార్టీలకు అడ్వాంటేజ్ ఉంటుంది.
ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ.. తమకే ఓటు వేయాలని ప్రజల్ని కన్విన్స్ చేయడం అంత తేలిక కాదు. అందుకే పోటీకి అభ్యర్థులు వెనుకాడుతున్నారు. జాతీయ పార్టీల వైపు చూస్తున్నారు. అందుకే బీఆర్ఎస్కు అభ్యర్థుల ఎంపిక తలకు మించిన భారం అవుతోంది. ఆర్థికంగా, సమాజంలో ఇమేజ్ ఉన్న అభ్యర్థుల కోసం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. చివరికి ఆయన తనను పరామర్శించడానికి వస్తున్న ప్రముఖుల్ని కూడా తమ పార్టీ తరపున పోటీ చేయమని అడుగుతున్నట్లుగా చెబుతున్నారు.