చిన్న చిన్న సైడ్ పాత్రలు చేసుకొంటూ – హీరోగా ఎదిగిన వాళ్లలో సుహాస్ ఒకడు. తన కామెడీ టైమింగ్ బ్రహ్మాండంగా ఉంటుంది. దాంతో పాటు మంచి కథలూ ఎంచుకొంటున్నాడు. ‘కలర్ ఫొటో’, ‘రైటర్ పద్మభూషన్’లతో తనకు మరింత గుర్తింపు దక్కింది. తన నుంచి వస్తున్న మరో సినిమా ‘అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు’. దుశ్యంత్ దర్శకుడు. ధీరజ్ మొగలినేని నిర్మాత. ఈ సినిమా వెనుక బన్నీ వాస్, వెంకటేష్ మహాల హస్తం కూడా ఉండడంతో సహజంగానే అందరి దృష్టీ పడింది. ఫిబ్రవరి 2న విడుదల అవుతోంది. ఈరోజు ట్రైలర్ వదిలారు.
ట్రైలర్లో ఫన్, ఎమోషన్, లవ్… ఇవన్నీ కనిపించాయి. గోదావరి జిల్లాల ఎటకారం, సుహాస్ కామెడీ టైమింగ్, ఆరోజుల్లో ‘అబ్బాస్ కటింగ్’ రిఫరెన్సులతో.. ట్రైలర్ తొలిభాగం సరదాగా సాగిపోయింది. మలిభాగంలో అసలు కథ మొదలైంది. పరువు కోసం పాకులాడే రెండు కుటుంబాలతో ఊరెలా అట్టుడికిపోయిందో చూపించారు. మధ్యలో ఓ టీచర్ కథ కూడా ఆసక్తిని కలిగిస్తోంది. కథలో, సన్నివేశాల అల్లికలో ఏదో డెప్త్ ఉందన్న సంగతి తెలుస్తోంది. ‘గుమ్మా..’ పాట ఇప్పటికే హిట్టు. దాన్ని ట్రైలర్లో బాగానే వాడుకొన్నారు. సరదాగా సాగిపోతున్న ఓ యువకుడి జీవితంలో ప్రేమ, దాని వెంట పరువు ప్రవేశిస్తే.. ఎంత కల్లోలంలో పడిపోతాడో చెప్పడానికే ఈ సినిమా తీశారనిపిస్తోంది. మొత్తానికి థియేటర్లకు వెళ్లి చూడదగ్గ కంటెంట్ ఈ సినిమాలో ఉందని ట్రైలర్ చెప్పకనే చెబుతోంది. శేఖర్ చంద్ర ఈ చిత్రానికి సంగీతాన్ని అందించాడు.