‘హనుమాన్’.. దేశ వ్యాప్తంగా ఈ సినిమా గురించే చర్చ జరుగుతోంది. సంక్రాంతికి తీవ్రమైన పోటీలో విడుదలైన ఈ చిత్రం తన సత్తాని చాటి అందరినీ నివ్వెరపరిచింది. స్టార్స్ ఎవరూ లేకుండా ప్రశాంత్ వర్మ రూ.200 కోట్ల సినిమా ఎలా తీశాడంటూ ఆశ్చర్యపోతున్నారంతా. సీక్వెల్ గా రాబోతున్న ‘జై హనుమాన్ ‘ లో మాత్రం స్టార్స్ హడావుడి బాగానే కనిపించబోతోంది. నిజానికి ‘హనుమాన్’ కథ కూడా కొంతమంది స్టార్స్ ని వెదుక్కొంటూ వెళ్లింది. హనుమంతుగా తేజా సజ్జా మొదటి ఆప్షన్ కాదు. కొంతమంది హీరోలు ఆ పాత్రని తిరస్కరించారు. ముఖ్యంగా ఈ సినిమాలో సముద్రఖని పోషించిన విభూషణుడి పాత్ర కోసం ముందుగా రిషబ్ శెట్టిని ఎంచుకోవాలని భావించాడు ప్రశాంత్ వర్మ.
అయితే ఆ సమయంలో రిషబ్ ‘కాంతార’తో బిజీగా ఉన్నాడు. అందుకే కథ, అందులోని విభూషణుడి పాత్ర నచ్చినా రిషబ్ చేయలేకపోయాడట. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు ప్రశాంత్ వర్మ. ”భవిష్యత్తులో మీతో తప్పకుండా పని చేస్తా. ఈసారికి మాత్రం నాకు కుదరడం లేదు” అంటూ రిషబ్ మర్యాద పూర్వకంగా చెప్పాడట. బహుశా.. ‘హనుమాన్ 2’లో రిషబ్ పాత్ర ఉండొచ్చేమో..? ప్రశాంత్ వర్మకు రామాయణం గాథని తెరపైకి తీసుకురావాలన్న బలమైన కోరిక ఉంది. తన సూపర్ హీరోల సిరీస్ అయిపోయిన తరవాత రామాయణ గాథపై తను దృష్టి పెడతాడేమో చూడాలి. ఈ యేడాదే ‘జై హనుమాన్’ సెట్స్‌పైకి వెళ్లనుంది. 2025లో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు ప్రశాంత్ వర్మ.