లోక్‌సభ నియోజకవర్గాలవారీగా కేటీఆర్ సమీక్షలు నిర్వహించారు. అయితే ఇందులోనూ ఆయన ప్రసంగాలు.. తాము ఎందుకు ఓడిపోయామో.. తనదైన శైలిలో విశ్లేషించారు. ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా ఓట్లేశారన.ి. బంధు పథకాలు వ్యతిరేకమయ్యాయని.. కాంగ్రెస్ తప్పుడు హామీలు ఇచ్చిందని ఇలా తమకు అనుకూలంగా ఉన్న వాటిని చెప్పుకొచ్చారు. కానీ అసలు కింది స్థాయిలో ఏం జరిగిందో క్యాడర్ నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకునేందుకు మాత్రం సిద్ధపడలేదు.
16 రోజులపాటు 17 ఎంపీ స్థానాలపై నిర్వహించిన సమీక్షా సమావేశాలు నిర్వహించారు. నిర్దిష్టంగా ఫలానా కార్యాచరణ అంటూ ఖరారు చేసుకోలేకపోయారు. అప్పుడే కాంగ్రెస్ పై ప్రజాగ్రహం పెరిగిపోతుందన్న ఆశతో … ప్రజలే తిరిగి బీఆర్ఎస్ కు ఓట్లేస్తారన్నట్లుగా కేటీఆర్ శైలి ఉంది. పార్టీ నిర్మాణం, దాని బలోపేతంపై లోతైన చర్చ చేయలేకపోయారు. క్యాడర్‌ను అస్సలు పట్టించుకోలేదనీ, కార్యకర్తలకు సంబంధం లేకుండా సంక్షేమ కార్యక్రమాలను నేరుగా లబ్దిదారులకు అందజేయటం కూడా పార్టీకి తీరని నష్టం చేకూర్చిందనే విషయాన్ని గుర్తించడానికి కేటీఆర్ మొహమాట పడ్డారు.
పదేండ్ల కాలంలో పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావును తాము కలిసిందే లేదని పలు నియోజకవర్గాలకు చెందిన సీనియర్ నేతలు సైతం సమీక్షల సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. వారిని కలిసేందుకు వస్తే అపాయింట్‌మెంట్లు దొరికేవి కావనీ, ఒకవేళ దొరికినా ఎమ్మెల్యేలు తమను కలవనీయకుండా అడ్డుకున్నారంటూ వారు వాపోయారు. కేటీఆర్ క్యాడర్ ఆవేదనను గుర్తిస్తే తప్పులు దిద్దుకోవచ్చని లేకపోతే… చేయగలిగిందేమీ లేదన్న అభిప్రాయం ఎక్కువగా బీఆర్ఎస్ లో వినిపిస్తోంది.