తెలంగాణలో భారీ అవినీతి తిమింగలం అవినీతి నిరోధక శాఖ వలకు చిక్కింది. ఒకటి కాదు..రెండు కాదు..బహిరంగ మార్కెట్లో విలువ ప్రకారం రూ.1000 కోట్లకుపైగా అక్రమాస్తులు ఏసీబీ అధికారుల దాడుల్లో బట్టబయలయ్యాయి. తవ్వుతున్న కొద్దీ లక్షల రూపాయల నగదు, అత్యంత విలువైన బంగారు నగలు, భూముల రిజిస్ట్రేషన్ల పత్రాలు, బినామీ పేరిట ఉన్న ఆస్తులు కుప్పలుతెప్పలుగా బయటపడుతున్నాయి.
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్, రెరా ప్రత్యేక కార్యదర్శిగా పనిచేస్తున్న శివ బాలకృష్ణ పై భారీగా ఫిర్యాదులు రావడంతో ఏసీబీ డీజీ సీవీ ఆనంద్ 14 ప్రత్యేక టీమ్‌లను రంగంలోకి దించారు. హైదరాబాద్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోని శివ బాలకృష్ణ ఆస్తులు, కార్యాలయాలపై ప్రత్యేక బృందాలు మెరుపు దాడికి దిగాయి. బాలకృష్ణ నివాసంలో ఇప్పటి వరకు జరిపిన సోదాల్లో దాదాపు రూ.40 లక్షల నగదుతో పాటు భారీగా ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది.
ఇంకోవైపు శివబాలకృష్ణతో పాటు అతని కుటుంబ సభ్యులకు చెందిన బ్యాంకు డిపాజిట్లు, లాకర్లను కూడా తెరవడానికి అధికారులు ప్రయత్నాలు మొదలు పెట్టారు. బ్యాంకు లాకర్లలో ఏమున్నయాన్నది తేలాల్సి ఉంది. వీటితో పాటు మరికొందరు బంధువుల నివాసాల్లో కూడా అధికారులు సోదాలను నిర్వహిస్తున్నట్టు తెలిసింది. బాలకృష్ణ అక్రమ ఆదాయాలపై గురువారం కూడా దర్యాప్తు సాగుతుందనీ, వాటి మొత్తం వివరాలను దర్యాప్తు పూర్తి అయ్యాక ప్రకటిస్తామని ఏసీబీ ఉన్నతాధికారులు చెబుతున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఆ అధికార పార్టీ నేతలకు అత్యంత సన్నిహితుడుగా శివబాలకృష్ణ పేరు తెచ్చుకున్నాడు.