రానా – తేజ కాంబినేషన్లో రూపుదిద్దుకొంటున్న సినిమా ‘రాక్షస రాజు’. ఈమధ్యే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. వీరిద్దరి కాంబోలో ఇది వరకు వచ్చిన `నేనే రాజు – నేనే మంత్రి` మంచి విజయాన్ని అందుకొంది. అందుకే ఈ సినిమాపై కాస్త ఆశలూ, కొన్ని అంచనాలూ ఏర్పడ్డాయి. ‘రాక్షసరాజు’లాంటి మాస్ టైటిల్ తో.. తేజ ఎక్ట్రాక్ట్ చేశాడు. యాక్షన్ మోడ్లో సాగే కథ ఇది. అయితే కాన్సెప్ట్ ఏమిటన్నది ఇంకా స్పష్టం కాలేదు. కాకపోతే ఇది బావా – బామ్మర్థుల కథ అని తెలుస్తోంది. బావ కళ్లలో ఆనందం చూడడం కోసం, బావకు అధికారం కట్టబెట్టడం కోసం ఓ బామ్మర్థి ఏం చేశాడన్న నేపథ్యంలో తేజ ఈ కథ రాసుకొన్నాడని తెలుస్తోంది. ఈ సినిమాలో రానా బావగా ఓ సీరియర్ హీరోని తీసుకోవాలన్నది తేజ ఆలోచన. అప్పుడు ఈ సినిమా కాస్త మల్టీస్టారర్ లుక్ లోకి మారుతుంది. ఆ పాత్ర కోసం మోహన్ లాల్ పేరు పరిశీలనలో ఉంది. మోహన్ లాల్ వస్తే… మిగిలిన భాషల్లోనూ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా విడుదల చేసే అవకాశం ఉంటుంది. బడ్జెట్ పెరిగినా, మార్కెట్ పరంగా కాస్త వెసులుబాటు ఉంటుంది. అందుకే… మోహన్ లాల్ ని రంగంలోకి దింపాలని తేజ భావిస్తున్నాడు.