వైసీపీ నేతలు ఎక్కడికి దిగజారిపోతున్నారో వారికే అర్థం కావడం లేదు. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరితే హుందాగా ఆమె రాజకీయాల్ని ఆమె చేసుకోనివ్వక పాలసీల మీద మాట్లాడక వ్యక్తిగత అంశాలను.. కుటుంబ అంశాలను రాజకీయాల్లోకి జగన్ రెడ్డి తీసుకు వచ్చారు. ఇప్పుడు అది రాను రాను మరంత తీవ్రంగా మారుతోంది. ఎంతంగా అంటే.. అసలు వైఎస్ కుటుంబంలో ఏం జరుగుతోందన్న దానిపై బయట విస్తృతంగా చర్చ జరుగుతోంది. షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు తన కుటుంబం చీలిందని గగ్గోలు పెట్టని జగన్ రెడ్డి.. ఆమె కాంగ్రెస్ లో చేరి ఏపీకి వచ్చే సరికి.. కాంగ్రెస్ పై నిందలేస్తున్నారు.
దానికి షర్మిల కౌంటర్ ఇచ్చారు. కుటుంబాన్ని జగన్ రెడ్డే చీల్చేశారని తేల్చేశారు. దానికి తన తల్లే సాక్ష్యామన్నారు. దానికి వెంటనే సజ్జల కౌంటర్ ఇవ్వడానికి మీడియా ముందుకు వచ్చేశారు. ఆయన దగ్గర ఉన్న సమాధానం చంద్రబాబే. చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్టునే షర్మిల చదివారని చెప్పుకొచ్చారు. ‘ఆమెకు పదవులు ఇవ్వకపోవడమే చేసిన అన్యాయమా.?’ అంటూ ప్రశ్నించారు. షర్మిల మాట్లాడిన ప్రతి మాటకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని.. ఆమె పొంతన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
‘షర్మిలకు ఏం అన్యాయం జరిగిందో చెప్పాలి.?. ఏపీ రాజకీయాలపై ఆమెకు అవగాహన లేదు. షర్మిలకు చంద్రబాబు స్క్రిప్ట్ రాయించారేమో.? అందులో ఏముందో చూడకుండా ఆమె బట్టీ పట్టారని ఆరోపించారు. సజ్జల రామకృష్ణారెడ్డి చేసే అతి కారణంగా రేపు విజయమ్మ కూడా మీడియా ముందుకు వస్తే ఆమెపైనా చంద్రబాబు స్క్రిప్ట చదువుతున్నారని నిందలు వేయడమే ఇక మిగిలిందన్న ఆగ్రహం వైసీపీ శ్రేణుల్లోనే కనిపిస్తోంది.