రాజకీయాల్లో ఆలోచన ఉండాలి కానీ ఆవేశం ఉండకూడదు. ఆత్మవిశ్వాసం ఉండాలి కానీ అహంకారం ఉండకూడదు. అలా ఉంటే ప్రజలు శంకరగిరి మాన్యాలకు పట్టించేస్తారు. కింది నుంచి ఎదిగిన నేతలకు ఈ విషయంపై చాలా స్పష్టత ఉంటుంది. అందుకే రాజకీయనేతలు ఆవేశం చూపించినా అందులో ఆలోచనే ఉంటుంది. అహంకారంలా మాట్లాడినట్లుగా అనిపించినా ఆత్మవిశ్వాసమే ప్రజలకు కనిపిస్తుంది. కానీ కొంత మంది పుట్టుకొచ్చేసిన నేతలకు మాత్రం ప్రజాస్వామ్యం మీద చాలా చులకన భావం ఉంటుంది. వారు చేసే ప్రకటనలు ఆత్మవిశ్వాసంతో అనుకోవడానికి కూడా ఉండదు.. ఎందుకంటే ఆ నేతలు ముందుగా చెప్పినట్లుగా పుట్టుకొచ్చారు తప్ప.. ప్రజల్లో నుంచి రాలేదు. ఇలాంటి నేతల వల్ల ప్రజలకేమీ కాదు కానీ.. వారి అభిమానాన్ని కొంత కాలం పాటు చూరగొన్న పార్టీలకే సమస్య. అలాంటి సమస్య ఇప్పుడు భారత రాష్ట్ర సమితి ఎదుర్కొంటోంది. ఆ పార్టీ భవిష్యత్ ను తీర్చిదిద్దుతాడనుకున్న కేటీఆర్.. చేస్తున్న ప్రకటనలతో మరింత చులకన అయిపోతున్నారు. ఓటమిని అంగీకరించలేకపోతున్న పరిస్థితి నుంచి రేపోమాపో ప్రభుత్వాన్ని కూలగొట్టేస్తామని బెదిరించే వరకూ వచ్చేసింది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని అంత తేలికగా కూలగొట్టవచ్చని కేటీఆర్ ఎందుకు అనుకుంటున్నారో కానీ అది బీఆర్ఎస్ పార్టీకే పెను ముప్పుగా మారే అవకాశం కనిపిస్తోంది.
ఓటమిని ఒప్పుకోలేక కిందామీదా పడుతున్న కేటీఆర్
ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుండి కేటీఆర్ ఓటమిని ఒప్పుకోనట్లుగానే వ్యవహరిస్తున్నారు. ప్రజలు అసలు కేసీఆర్ ను ఓడించలేదని అసంతృప్త ఎమ్మెల్యేలను మాత్రమే ఓడించారని కానీ ఇప్పుడు కేటీఆర్ సీఎంగా లేకపోవడం వల్ల ప్రజలు బాధపడిపోతున్నారని . కేటీఆర్ చాలా బాధపడిపోయారు. కానీ ఇక్కడ స్వయంగా తన రాజకీయ జీవితలో రెండో సారి కేటీఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేసి ఓడిపోయారనే సంగతిని ఉద్దేశపూర్వకంగా కేటీఆర్ మర్చిపోతున్నారు. ఎవరికీ గుర్తుండదని అనుకుంటున్నారు. కామారెడ్డిలో కేసీఆర్ పై పోటీ చేసేవారు ఎవరైనా సరే.. బలిచ్చేందుకు గుడిముందు కట్టేసే పొట్టేలు లాంటి వారని ప్రచారంలో కేటీఆర్ చెప్పేవారు. కానీ కామారెడ్డిలో బీజేపీ అభ్యర్థి కాటిపల్లి రమణారెడ్డి గెలిారు. ఆయనను అనామకునిగా కేటీఆర్ తీర్పు చెప్పేస్తున్నారు. అనామకుడి చేతిలో కేటీఆర్ ఓడిపోవడాన్ని కేటీఆర్ అవమానంగా ఫీలవుతున్నారు. ప్రజాస్వామ్యంలో ఉండే గొప్పతనం అదే. ప్రజల ముందు ఎంత పెద్ద లీడర్ అయినా అనామకుడే. ఇప్పుడు కాటిపల్లి రమణారెడ్డి చేతిలో ఓడిపోయిన కేసీఆరే అనామకుడు అనుకోవాలి. ఎందుకంటే.. గెలిపించేది.. ఓడించేది ప్రజలే. కేసీఆర్ లేదా మరో లీడర్ బస్కీలు తీసి కండలు పెంచుకుని బరిలోకి దిగి బాక్సింగ్ చేసి గెలవురు. ఓడించినా గెలిచినా ప్రజలే ఓట్లేయాలి. ఈ ప్రజాస్వామ్య సూత్రాన్ని కేటీఆర్ విజయవంతంగా మర్చిపోతున్నారు. తనను తాను వంచించుకుంటున్నారో లేకపోతే పార్టీ నేతలకు .. మన పార్టీ ఓడిపోలేదు.. ప్రజలే తప్పు చేశారని చెప్పాలనుకుంటున్నారో కానీ.. మొత్తానికే ఆయన మాటలు మాత్రం రివర్స్ లో వెళ్లిపోతన్నాయి. అంతే కాదు త్వరలోనే కేసీఆర్ ను సీఎంను చేసుకుందామని ప్రకటించేస్తున్నారు. అలా ఎలా సాధ్యమని అడిగే వారికి.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను లాగేస్తామని అన్నట్లుగా సంకేతాలు ఇస్తున్నారు.
నలుగురు ఎమ్మెల్యేలను కొంటే ప్రజా ప్రభుత్వం కూలిపోదు కదా!
కానీ కేటీఆర్ కు అర్థం కాని విషయం ఏమిటంటే.. దేశంలో ప్రజా ప్రభుత్వం సంపూర్ణ మెజార్టీతో ఏర్పడిన ప్రజా ప్రభుత్వాన్ని కూల్చేయడం నలుగురు ఎమ్మెల్యేలను లాక్కోవడ ద్వారా సాధ్యం కాదు. ఒక్క సారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత … ఆ ప్రభుత్వాన్ని కూల్చాలంటే… రాజ్యాంగ వ్యవస్థలన్నీ కలిసి రావాలి. ఇప్పటికిప్పుడు ప్రభుత్వాన్ని కూల్చాలంటే.. కేటీఆర్ కు లేదా బీఆర్ఎస్ కు సహకరించే వ్యవస్థలు ఏమున్నాయి..?. ఒక్కటి కూడా లేదు. మహారాష్ట్రలో మారలేదా.. గతంలో కర్ణాటకలో మారలేదా అని కేటీఆర్ ఉదాహరణలు చెప్పవచ్చు కానీ.. అక్కడ మార్చింది.. మార్చాలనుకున్నది బీజేపీనే. బీజేపీకి ఉన్న అసాధారణ శక్తిలో బీఆర్ఎస్ కు కానీ కేటీఆర్ కు కాన ఒక్క శాతం కూడా లేదు. బీజేపీనే కలిసి వస్తుందని.. రెండు పార్టీలు కలిసి కాంగ్రెస్ ను కూల్చేస్తామని కేటీఆర్ అనుకుంటున్నారేమోకానీ.. కాస్త తరచి చూస్తే.. బీజేపీ అసలు కాంగ్రెస్ సర్కార్ జోలికి వెళ్లనే వెళ్లదని అర్థం చేసుకోవచ్చు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ .. రెండు , మూడు సీట్లు కన్నా ఎక్కువ తెచ్చుకోలేకపోతే.. బీజేపీ ఆటోమేటిక్ గా బలపడుతుంది. పదేళ్ల ఇష్టారాజ్య పరిపాలన లగేజీ మోయలేనంతగా పోగుపడిపోయి ఉంది. ఇక ప్రజల్లో ఏ మాత్రం పలుకుబడి లేదని తెలిసిన తర్వాత ఎవరు మాత్రం ఎందుకు ఊరుకుంటారు..? వీలైనంతగా పార్టీని నిర్వీర్యం చేస్తాు. అందులో సందేహమే ఉండదు. కాంగ్రెస్ భుజంపై తుపాకీపెట్టి బీఆర్ఎస్ ను కాల్చాలని బీజేపీ అనుకున్నా.. అనుకోకపోయినా.. కాంగ్రెస్ మాత్రం తాను చేయాలనుకున్నది తాను చేస్తుంది.. ఎందుకంటే.. తెలంగాణలో ముఖాముఖి పోరు కోరుకునేది కాంగ్రెస్.. అంతే కాదు.. బీఆర్ఎస్ ఉంటే.. ఎక్కువగా ఇబ్బంది పడేది కాంగ్రెస్. ఆ పార్టీని నిర్వీర్యం చేస్తే జాతీయ పార్టీలు ముఖాముఖి తలపడే అవకాశం ఏర్పడుతుంది. ఆ రెండు పార్టీలు తేల్చుకుంటాయి. ఇందు కోసం మహమహులు విశ్లేషణ చేయాల్సిన అవసరం లేదు. కేటీఆర్ కాస్త ప్రశాంతంగా కూర్చుని విశ్లేషించుకుంటే సరిపోతుంది.
సీఎం పదవిలో ఉన్న రేవంత్ ను కేసీఆర్, కేటీఆర్ ఎదుర్కోగలరా ?
కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఎలా ఉంటుందో చూస్తారని.. మిగతా అంతా చీమలు.. ఆయన ఒక్కడే టైగర్ అన్నట్లుగా కేటీఆర్ మాట్లాడుతున్నారు. కానీ అసలు కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా వస్తే రేవంత్ రెడ్డిని ఎదుర్కోగలరా అన్న ఓ సందేహం రాజకీయవర్గాల్లో ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డిని అత్యంత ఘోరంగా టార్చర్ చేసింది కేసీఆర్. ప్రతీకారం అనే భావన లేకుండా రాజకీయనాయకుడు ఉండడు. పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి రేవంత్ రెడ్డి అన్నీ మర్చిపోయినట్లుగా ఉంటారేమో.. కానీ ఒక్క సారి పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత పంజావి సరకుండా ఉంటారా … కేసులు, జైళ్ల సంగతి పక్కన పెడితే.. అసెంబ్లీలో రేవంత్ దాడిని కేసీఆర్ తట్టుకోవడం అసాధ్యం. కేసీఆర్ లాగా.. అందర్నీ సస్పెండ్ చేసేసి.. సభ నడిపించుకుని సాఫీగా ఇంటికెళ్లిపోదామనుకునే టైపు రేవంత్ రెడ్డి కాదని మొదటి సమావేశాల్లోనే తేలింది. అందరూ సభలో ఉండాలి.. చేసిన నిర్వాకాలను వారి సమక్షంలోనే ప్రజలకు తెలియచెప్పాలి.. అదే వారికి వేసే శిక్ష అన్న వ్యూహాన్ని రేవంత్ రెడ్డి అమలు చేస్తున్నారు. మరి రేవంత్ రెడ్డికి కేసీఆర్ ఎదురెళ్లగలరా ?. తనతో పాటు సుదీర్ఘకాలం పని చేసి ఉద్యమలో కుడి భజంగా వ్యవహరించి.. తమ్ముడు అన్న ఆప్యాయతల్ని పంచిన ఈటల రాజేందర్ ను కుట్ర పూరితంగా పార్టీ నుంచి గెంటేసిన తర్వాత బీజేపీ నుంచి గెలిచి వస్తే.. ఆయన మొహం చూడటానికి ఈగో ప్రాబ్లం అయి కేసీఆర్ హాజరు కాకపోవడమో.. హాజరు అవ్వాల్సి వస్తే ఈటలను సస్పెండ్ చేయడమో చేసి తప్పించుకున్నది ప్రజలు మర్చిపోతారా?/..
గెలుపోటములు ప్రజావిజయం – ఏ పాత్ర ఇస్తే దాంతో సర్దకుపోవాలి!
రాజకీయాలు అన్న తర్వాత గెలుపోటములు ఉంటాయి. గెలిచినప్పుడు తమ ప్రతాపమే .. ఓడినప్పుడు ప్రజల తప్పు అనుకుంటే అంత కంటే అహంకారం రాజకీయాల్లో ఉండదు. ప్రజలు గెలిస్తేనే ప్రజాస్వామ్యం. కేసీఆర్ ఎన్నికల ప్రచార సభల్లో ప్రజలు గెలవాలని ప్రచారం చేస్తూ వచ్చారు. అదే నిజం. ప్రతి ఎన్నికల్లో ఎవరు గెలిచినా ప్రజలు గెలిచినట్లే. తాము గెలవలేదు కాబట్టి ప్రజలు గెలవలేదు అని అనుకోకూడదు. అలా అనకుంటే తీర్పు చెప్పిన ప్రజల్ని కించ పరిచినట్లే అవుతుంది. ప్రస్తుతం కేటీఆర్ అదే పనిలో ఉన్నారు. తామేంటి.. అధికారంలో లేకపోవడం ఏమిటి అన్నట్లుగా ఆయన మథనపడిపోతున్నారు. ఉన్న పళంగా అధికారంలోకి వచ్చేయాలని అనుకుంటున్నారు. కానీ అది సాధ్యమా కాదా అన్న విషయం కంటే.. అసలు అలా ఆలోచించకూడదని అనుకోవడం లేదు. కేటీఆర్ ప్రజల్లో నుంచి వచ్చిన నేత కాదు. ఆయన వారసుడు. ఉద్యమ వేడిలో ఆయన నాయకుడు అయ్యాడు. అప్పటి నుంచి నల్లేరుపై నడక అన్నట్లుగా సాగింది. మొదటి సారిగా ఆయన రాజకీయ సవాళ్లను ఎదుర్కొంటున్నరు. దీన్నే అవకాశంగా తీసుకుని నాయకుడిగా నిరూపించుకుని ప్రజల మన్ననలను పొందాలి కానీ.. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూలగొట్టేసి.. తాము అధికారం చేపట్టబోతున్నామని గాల్లో తేలిపోవడం.. తాము తప్ప తెలంగాణలో అధికారం అనుభవించడానికి లేదన్నట్లుగా వ్యవహరించడం ఖచ్చితంగా పతనావస్థకు దారి తీస్తుంది. ఇప్పుడు కేటీఆర్ అదే దశలో ఉన్నారని ఎవరికైనా అనిపిస్తే తప్పేమీ లేదు. రాజకీయాల్లో పండిపోయిన వారైనా.. కొత్తగా ఎంట్రీ ఇచ్చే వారైనా..ప్రజాస్వామ్యంలో నిలబడాలంటే.. కొన్ని బేసిక్ ప్రిన్సిపుల్స్ తెలుసుకుని పాటిస్తారు. దురదృష్టవసాత్తూ.. కేటీఆర్ అలాంటివి కూడా పాటించకపోవడమే ఇక్కడ బీఆర్ఎస్ కు పెనుముప్పుగా మారబోతోంది.
కేసీఆర్ తెలంగాణ సీఎం అయినప్పటి నుండి కేటీఆర్ ను సీఎంను చేస్తారని ప్రచారం జరిగింది. కేసీఆర్ మనసులో ఏముందో కానీ.. ఓడిపోయే వరకూ చేయలేదు. మూడో సారి గెలిస్తే కేటీఆర్ సీఎం అవుతారని అనుకున్నారు. ఆయనే పార్టీని లీడ్ తీసుకుని నడిపించారు. చివరికి పార్టీ ఓడిపోయింది. కేటీఆర్ ఓటమిని మర్చిపోయి.. గెలుపు కోసం వచ్చే ఐదేళ్లు కష్టపడితే ప్రయోజనం ఉంటుంది కానీ షార్ట్ కట్ లో పవర్ లోకి వచ్చేయాలనుకుంటే మొత్తానికి షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఉంది.