తెలుగుదేశం పార్టీకి సోషల్ మీడియాలో ..బయట ఎంత మంది సపోర్టు చేస్తారో కానీ అంత కంటే ఎక్కువ మందే స్ట్రాటజిస్టులు తామే టీడీపీ కోసం పని చేస్తున్నామన్న భ్రమల్లో మునిగిపోయి ఉంటారు. టీడీపీకి సంబంధించిన ప్రతీ విషయాన్ని వీరంతా.. నలభై కోణాల్లో విశ్లేషించి ఏం చేయాలో .. ఏం చేయకూడదో ప్రకటించేస్తున్నారు. జనసేనతో పొత్తు విషయంలో పవన్ కల్యాణ్ చెప్పిన కొన్ని వాక్యాలను పట్టుకుని.. స్ట్రాటజిక్ సలహాలతో సోషల్ మీడియాను దున్నేస్తున్నారు. అసలు వీళ్ల లక్ష్యం ఏమిటో వాళ్లకైనా తెలుసో లేదో మరి..!
నారా లోకేష్ చాలా స్పష్టంగా చెప్పారు.. పొత్తు ఎందు కోసమో. వంద సీట్ల కోసం అయితే ఒంటరిగా పోటీ చేయవచ్చు కానీ.. వైసీపీని పూర్తి స్థాయిలో సీన్ లో లేకుండా చేయాలంటే పొత్తు ఉండాలన్నారు. ఆయన మాటలు అవి. ఇక జనసేనకు ఎన్ని సీట్లు ఇవ్వాలి.. ఏ సీట్లు ఇవ్వాలన్నది పై స్థాయిలో నిర్ణయించుకుంటారు. పవన్ కల్యాణ్ కూడా పట్టుదలకు పోయి సీట్లు తీసుకుని.. ఓడిపోవాలని అనుకోరు కదా. తీసుకున్న సీట్లలో వంద శాతం గెలిస్తే చాలనుకుంటారు. పాతిక సీట్లలో పోటి చేసి పాతిక సీట్లు గెలిస్తే చిన్న విషయమా.. యాభైసీట్లలో పోటీ చేసి పాతిక సీట్లలో గెలిస్తే పెద్ద విషయమా అనే రాజకీయం వారికి తెలియదా ? పవన్ రెండు సీట్లకు అభ్యర్థుల్ని ప్రకటించారు. దానికి చంద్రబాబు రెండు సీట్లను ప్రకటించారన్న కారణం చూపించారు. నిజానికి ఇక్కడ పోటీలు పెట్టుకోవడం కన్నా.. ఆ రెండు పార్టీలు వేగంగా నిర్ణయాలు తీసుకుని సీట్ల షేరింగ్ పూర్తి చేసుకుని అధికారిక ప్రకటన చేస్తే బాగుంటుందన్న అభిప్రాయం ఉంది. కానీ వారి రాజకీయ వ్యూహాలు వారికి ఉన్నాయి.
వైసీపీకి చిన్న చాన్సిచ్చినా.. ఏం జరుగుతుదో వారికి తెలుసు. పొత్తులు వద్దని కొంత మంది ప్రకటనలు చేస్తున్నారు. చంద్రబాబుకు సలహాలిస్తున్నారు. పవన్ నిలకడ లేని తనంపై ఉదాహరణలు చెబుతున్నారు రాజకీయాల్లో తొందరపాటు అనేది ఖచ్చితంగా పతనానికే దారి తీస్తుంది. పంతాలకు పోతే ఏం జరుగుతుందో ఇప్పటికే చాలా మంది రాజకీయ నేతల జీవితాలు తలకిందులై ఎదురుగా కనిపిస్తూనే ఉన్నాయి. ఈ పొత్తు ప్రహసనాన్ని ఎంత వేగంగా పూర్తి చేస్తే కూటమికి అంత మంచి జరుగుతుందని.. ఎక్కువమంది భావన.