కాంగ్రెస్ పార్టీలో చేరి రాజకీయ పోరాటం ప్రారంభించిన షర్మిలను వైసీపీ పూర్తిగా టార్గెట్ చేస్తోంది. ఆమె వ్యక్తిత్వాన్ని కించపరిచేలా కొంత మంది నేతలతో ప్రకటనలు చేయిస్తున్నారు. కొండా రాఘవరెడ్డి అనే తెలంగాణ నేతను తెర ముందుకు తీసుకు వచ్చి రకరకాల ఆరోపణలు చేయించారు వైసీపీ నేతలు. ఆమె పాదయాత్ర చేయాలనుకోలేదని.. జగన్ రెడ్డి జైలుకు వెళ్లినప్పుడు భారతి రెడ్డి పాదయాత్ర చేయాలనుకుంటే.. షర్మిలనే ముందుకు వచ్చి పాదయాత్ర చేశారని చెప్పుకొచ్చారు.
అంతే కాదు జగన్ రెడ్డి సీఎం అయ్యాక వ్యక్తిగత ప్రయోజనాల కోసం కలిశారని ఆరోపించారు. ఆమె ఇంటి పేరునూ మార్చిచెబుతున్నారు. ఈ ఆరోపణలపై షర్మిల ఘాటుగా స్పందించారు. రాజశేఖర్ రెడ్డి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అయినప్పుడు ఆయన బిడ్డ వైఎస్ షర్మిలా రెడ్డి కాకుండా ఎలా పోతుందని ప్రశ్నించారు. దగ్గరి మనుషులు కూడా ఎన్నెన్నో మాట్లాడుతున్నారు.. భారతి చేయాలని అనుకున్న పాదయాత్ర నేను చేశానట.. నా స్వార్థం కోసం పాదయాత్ర చేశానట.. జైల్లో అధికారి చెప్పాడట… దమ్ముంటే అప్పటి జైలు అధికారి తో ఈ విషయం చెప్పించ గలరా ?అని సవాల్ చేశారు. నన్ను అడిగితే తప్ప నేను పాదయాత్ర చేయలేదన్నారు. తప్పుడు నిందలు వేయాలని చూస్తే పైన దేవుడు ఉన్నాడని హెచ్చరించారు. తనపై చేసిన ఆరోపణలను తల్లి విజయమ్మతో చెప్పించాలని సవాల్ చేశారు. వైసీపీ సలహాదారు సజ్జల చేసే టాస్క్ లు ఇలాంటివే ఉంటాయి. కొండా రాఘవరెడ్డికి స్క్రిప్ట్ పంపి.. అందులో రచయితగా.. జైలు అధికారిని చేర్చారు కానీ. కుటుంబసభ్యుల్ని చేర్చలేదు.
కానీ వైసీపీ సోషల్ మీడియా మాత్రం విస్తృతంగా ప్రచారం చేస్తుంది. ఏమన్నా అంటే… మేము అనలేదు.. ఎవడో కొండా రాఘవరెడ్డి అన్నారని కవర్ చేసుకోవడానికి ఈ చీప్ ట్రిక్స్. ఇలా షర్మిలను రెచ్చగొట్టడం వల్ల ఎవరికి నష్టం అంటే.. ప్రతీ దానికి కౌంటర్ ఇచ్చేందుకు.. షర్మిల రెడీగా ఉంటారు కాబట్టి వైసీపీకే నష్టం. షర్మిల విషయాన్ని రాజకీయంగానే డీల్ చేయకుండా కుటుంబ విషయాలను.. ఆమె వ్యక్తిత్వాన్ని కించ పరిచేలా చేస్తూండటం.. వైసీపీకి మరింత నష్టం చేస్తోందని ఆ పార్టీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.