గతంలో ప్రభుత్వంలో ఉండి అధికార విధులు నిర్వర్తించిన టీడీపీ నేతలకు.. ఈ ఐదేళ్లు 17ఏ వర్తించలేదు. ఎడాపెడా అరెస్టులు చేశారు. చంద్రబాబునీ అరెస్టు చేశారు. ఏసీబీ కోర్టు 17ఏ వర్తించదని చెప్పి రిమాండ్ కు పంపింది. తర్వాత హైకోర్టులో కనీస ఆధారాలేవీ అని అడిగినా నీళ్లు నమిలి ప్రెస్ మీట్ పెట్టారు తప్ప కోర్టుకు సమర్పించలేదు. ఇప్పుడీ అంశం సుప్రీకోర్టులో ఉంది. అయితే హఠాత్తుగా ఏసీబీ కోర్టు ఓ కీలకమైన ఉత్తర్వులు ఇచ్చింది. అదేమిటంటే.. ప్రజాప్రతినిధులు అధికార విధులు నిర్వర్తించిన అంశంలో కేసులు నమోదు చేయాలంటే..ఖచ్చితంగా 17ఏ ప్రకారం కాంపిటెంట్ అధారిటీ అంటే గవర్నర్ అనుమతి ఉండాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది.
ఈ కారణంతో అచ్చెన్నాయుడుపై చార్జిషిటును పరిగణనలోకి తీసుకోవడానికి నిరాకరించింది. ఇప్పుడీ అంశం సంచలనంగా మారింది. అచ్చెన్నాయుడు మంత్రిగా ఉన్నప్పుుడు ఈఎస్ఐ వ్యవహారంలో అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ.. ఆయన స్వగ్రామం నిమ్మాడలో ఆపరేషన్ చేయించుకుని ఉన్న సమయంలో సీఐడీ అధికారులు గ్రామంపై దండెత్తి.. ఇంటి గోడలు దూకి మరీ అచ్చెన్నను అరెస్టు చేశారు. ఒక్క నోటీసు ఇస్తే ఆయన వస్తారు. కానీ అదేమీ ఇవ్వకుండా అలా అరెస్టు చేసి.. రోడ్డు మార్గం ద్వారా ఆయనను గుంటూరు తీసుకెళ్లారు. ఆ తర్వాత కోర్టులో ప్రవేశ పెట్టి.. కనీసం రెండున్నర నెలలు జైల్లో ఉంచారు. ఇది జరిగి దాదాపుగా నాలుగేళ్లవుతోంది. ఇప్పుడు ఆ కేసులో చార్జిషీటు దాఖలు చేసేందుకు సీఐడీ అధికారులు ప్రయత్నించారు.
కానీ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి తిరస్కరించారు. గవర్నర్ అనుమతి కావాలన్నారు. అచ్చెన్నాయుడు రూపాయి లాభం పొందారని కానీ .. లేకపోతే ఆయన కుటంబసభ్యులు లాభం పొందారని కానీ ఒక్కమాట చెప్పడం లేదు. మాటకు ముందు దుర్వినియోగం అనే పదం వాడేస్తూ.. కేసులు పెట్టేస్తూ వస్తున్నారు. స్కిల్ కేసులోనూ అదే చెప్పారు. ఎక్కడా ఒక్క రూపాయి మనీ ట్రయల్ ఉందని చెప్పడం లేదు. రాజకీయ వేధింపులని చాలా స్పష్టంగా తెలుస్తున్నప్పటికీ టీడీపీ నేతలకు ఏ వ్యవస్థా రక్షణ ఇవ్వలేదు. కానీ అంతా అయిపోయాక ఎన్నికలకు ముందు మాత్రం ట్విస్టులు కనిపిస్తున్నాయి. అచ్చెన్న కేసులో ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఇచ్చిన రూలింగ్ ప్రకారం చూస్తే ఇక ప్రతి కేసులోనూ అంటే.. చంద్రబాబు సహా టీడీపీ మాజీ మంత్రులపై పెట్టిన ప్రతీ కేసులోనూ చార్జిషీటు్‌కు గవర్నర్ అనుమతి తీసుకోవాల్సిందే. అంటే..ఇప్పుడు అనుమతి తీసుకోకండానే విచారణ చేసినట్లుగా స్పష్టమయింది. చట్టాన్ని ఉల్లంఘించారని క్లారిటీ వస్తుంది. ఇప్పుడు అన్ని చార్జిషీట్లూ యాక్సెప్ట్ చేయరన్నమాట.