సిద్ధం పేరుతో ఎన్నికల ప్రచార సభల్ని జగన్ రెడ్డి ప్రారంభిస్తున్నారు. ఆయనేమీ ప్రతిపక్ష నేతగా లేరు. ప్రభుత్వాధినేతగా ఉన్నారు. మరి ఎవరిపై ఆయన యుద్ధానికి సిద్ధమయ్యారో కానీ.. గత ఐదేళ్లుగా తాడేపల్లి ప్యాలెస్ నుంచి ప్రజల్లోకి రాని ఆయన ఇప్పుడు మాత్రం.. సిద్ధం పేరుతో రెడీ అయ్యారు. కార్యకర్తల సభలు పేరుతో బహిరంగసభలు నిర్వహస్తున్నారు. ఈ ఐదేళ్లలో ఆయన క్యాడర్ కు అందుబాటులో ఉన్నదే లేదు. ఎమ్మెల్యేలనే ఒకటి, రెండు సార్లు కలిసి ఉంటారు. అసలు క్యాడర్ ప్రమేయం లేకుండానే పాలన చేశారు.
వాలంటీర్లు చాలన్నట్లుగా వ్యవహరించారు. మన ప్లేట్లో మన బిర్యానీ అని ఆశ పెట్టిన జగన్ రెడ్డి చివరికి వారికి ఉన్న చద్దిబువ్వను కూడా లాగేసుకున్నారు. బిల్లులు రాక ఎంతో మంది ఆస్తులు అమ్ముకుంటున్నారని.. ఎమ్మెల్యేలు వాపోతున్నారు. ఇప్పుడు ఎన్నికలకు ముందు జగన్ రెడ్డికి క్యాడర్. కార్యకర్తలు గుర్తుకు వచ్చారు. మళ్లీ గెలిపించాలంంటూ విజ్ఞప్తులతో ప్రారంభమవుతున్నారు.
ఇప్పుడు ఆయన సభలకు డ్వాక్రా మహిళల్ని తరలిస్తారో.. పెన్షనర్లను తరలిస్తారో కానీ.. సభకు మాత్రం జన సమీకరణ చేయాలన్న పట్టుదలతో ఉన్నారు. వైసీపీలో అన్ని స్థాయిల్లో నిరాశ పేరుకుపోవడంతో.. పరిస్థితి గందరగోళంగా ఉంది. అయితే సభల్ని సక్సెస్ చేయాలన్న పట్టుదలతో ఉన్నారు. కానీ హ్యాపీగా దిగిపోతా అన్నకామెంట్ల తర్వాత ఈ సిద్ధం అని టైటిల్ ప్రచారంలోకి తేవడంతో .. సెంటిమెంట్ కూడా దెబ్బతిన్నది.