రాజానగరంలో జనసేన పోటీ చేస్తుందనగానే.. ఆ పార్టీ నేత బత్తుల బలరామకృష్ణ తానే అభ్యర్థినని సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు. తన పేరునే పవన్ ప్రకటించినట్లుగా ఆయన చెప్పుకోవడంతో జనసేనలో కలకలం రేగుతోంది. పవన్ రాజానగరంలో జనసేన పోటీ చేస్తుందనగానే నియోజక వర్గ ఇన్ఛార్జి బత్తుల బలరామ కృష్ణ శిబిరంలో ఉత్సాహం నెలకొంది. జనసేన కార్యాలయానికి కార్యకర్తలు, అభిమానుల పెద్ద ఎత్తున తరలి వచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు.
బత్తుల బలరామకృష్ణ సైతం తమ పార్టీ అధినేతకు పత్రికా ముఖంగా ధన్యవాదాలు తెలిపారు. కానీ జనసేన పోటీ చేస్తుందని చెప్పారు తప్ప అభ్యర్థిని ప్రకటించలేదు. నిజానికి రాజానగరంలో జనసేన తరపున పోటీకి ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ బరిలో నిలబడతారనే ప్రచారం జరుగుతోంది. టిడిపి, జనసేన పొత్తులో రాజమహేంద్రవరం రూరల్ నియోజక వర్గంలో కొన్ని రోజులుగా పలు మార్లు చర్చలు జరిపినా ఫలితం లేకపోయింది. టిడిపి సీనియర్ నేత, ఎంఎల్ఎ గోరంట్ల బుచ్చయ్య చౌదరి వరుసగా ఇక్కడ రెండు సార్లు ఎంఎల్ఏగా గెలుపొందారు. ఈ నియోజక వర్గం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోరినట్లు సమాచారం. టీడీపీ కిది సిట్టింగ్ సీటు కావడంతో చిక్కుముడి వీడటంలేదు. జనసేన జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్, బుచ్చయ్య చౌదరి ఎవరికి వారు తామే పోటీ చేస్తామనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల దుర్గేష్ సతీమణి ఉషారాణి మృతి చెందారు. పరామర్శకు వెళ్లిన జనసేన ముఖ్యనేతలు నాగేంద్రబాబు, నాదెండ్ల మనోహర్ ఇరువురూ కందుల దుర్గేష్తో చర్చించినట్లుగా తెలుస్తోంది.
తేదేపా-జనసేన పొత్తు నేపథ్యంలో రాజమండ్రి రూరల్ నియోజక వర్గం టిడిపికి కేటాయిస్తే రాజానగరం నుంచి జనసేన అభ్యర్థిగా కందుల దుర్గేష్ ను ఖరారు చేస్తామని చెప్పినట్లుగా తెలుస్తోంది. దీనికి ఆయన అంగీకరించారని అంటున్నారు. అయితే బత్తుల బలరామకృష్ణ హడావుడి.. జనసేనను ఇబ్బంది పెడుతోంది.