తమిళనాట రజనీకాంత్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రజనీకి సమాంతరంగా.. విజయ్ కూడా తన అభిమానగణాన్ని పెంచుకోగలిగాడు. ఇప్పుడు తమిళనాట రజనీకాంత్, విజయ్ అభిమానుల మధ్య `నువ్వా? నేనా?` అన్నట్టు పోటీ సాగుతుంటుంది. సోషల్ మీడియాలో రెండు వర్గాలూ చెలరేగిపోతుంటాయి. విజయ్ సినిమాలు విడుదల అయినప్పుడు రజనీ ఫ్యాన్స్, రజనీ సినిమాలు బయటకు వచ్చినప్పుడు విజయ్ ఫ్యాన్స్ ట్రోల్స్ తో వార్ మొదలెట్టేస్తారు. విజయ్ కూడా అప్పుడప్పుడూ.. రజనీ ఫ్యాన్స్‌కు చిర్రెత్తేలా కామెంట్లు విసురుతుంటాడు. `జైలర్` వేడుకలో రజనీకాంత్ కూడా విజయ్‌ని ఉద్దేశించి పరోక్షంగా కొన్ని కామెంట్లు చేశాడు. దాంతో మరోసారి రజనీ, విజయ్ మధ్య కోల్డ్ వార్ ఉదంతం బయటకు వచ్చింది. తాజాగా.. `లాల్ సలామ్`లో విజయ్ తో పోటీ గురించి రజనీకాంత్ కీలకమైన కామెంట్లు చేశాడు. విజయ్‌తో తనకు పోటీ లేదని, విజయ్ తన కళ్లముందు పెరిగాడని, ‘ధర్మథిన్ తలైవన్’ షూటింగ్ సమయంలో13 ఏళ్ల వయసున్న విజయ్‌ని నేను చూశాను. యాక్టింగ్ అంటే ఇష్టమని నాతో చెప్పాడు. ముందు చదువులపై శ్రద్ధపెట్టమని, ఆ తరవాత నటన వైపు రావాలని సలహా ఇచ్చానని, చెప్పినట్టే తన కష్టంతో విజయ్ పై స్థాయికి వచ్చాడని గుర్తు చేసుకొన్నారు రజనీకాంత్. `జైలర్` ఈవెంట్లో తాను చెప్పిన కాకి, డేగ కథ గురించి అభిమానులు తప్పుగా అర్థం చేసుకొన్నారని, విజయ్‌ని ఉద్దేశించి తాను ఆ వ్యాఖ్యలు చేయలేదని ఈ సందర్భంగా వివరణ ఇచ్చుకొన్నారు రజనీ.
”మా మధ్య పోటీ ఉందని అందరూ అంటుంటే వినడం బాధగా ఉంది. అలా చెప్పడం అమర్యాద. అందుకే మమ్మల్ని పోల్చవద్దని ఫ్యాన్స్‌కు రిక్వెస్ట్ చేస్తున్నాను’’ అంటూ అభిమానులకు హితవు పలికారు. విజయ్ సినిమా విడుదల అయినప్పుడు మంచి విజయాన్ని అందుకోవాలని తాను కోరుకొన్నానని, తన విజయాన్ని ఎప్పుడూ ఆకాంక్షిస్తానని చెప్పుకొచ్చారు రజనీ. రజనీ స్పీచ్‌తో.. తమ మధ్య ఎలాంటి గొడవలూ లేవని తేలిపోయింది. రజనీ అంతటి వాడు.. కాస్త దిగి వచ్చి, తన తరువాతి తరం హీరోని అభినందించడం, తన విజయాన్ని ఆకాంక్షించడం గొప్ప పరిణామమే. తమిళ నాట ఫ్యాన్స్ వార్ ని కంట్రోల్ చేయడానికి రజనీ కామెంట్లు ఎంతో కొంత దోహదం చేస్తాయి. ఇకపై కూడా రజనీ, విజయ్ అభిమానులు కొట్టుకొంటే అది హీరోల తప్పు కాదు. ముమ్మాటికీ ఫ్యాన్స్ తప్పే.