చెప్పినవన్నీ చేశానని మళ్లీ నాకే ఓటేయాలని జగన్ రెడ్డి ప్రచారం చేస్తున్నారు. కానీ చెప్పినవీ ఏవీ చేయలేదని విపక్షాలంటున్నాయి. ప్రధానమైన హామీలనే అమలు చేయలేదని గుర్తు చేస్తున్నాయి. ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల కూడా అదే అంటున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాట మీద నిలబడే నాయకుడు అని.. జగన్ మాట తప్పే నాయకుడు అని షర్మిల తేల్చేశారు. మద్యపాన నిషేధం చేయకపోతే ఓట్లు అడగను అని ఆనాడు జగన్ చెప్పారని ఇప్పుడేం చేశారని ప్రశ్నించారు. మేనిఫెస్టో అంటే బైబిల్, ఖురాన్, భగవద్గీత వంటిది అన్న జగన్.. ఇచ్చిన ప్రతి మాట తప్పారని ఎద్దేవా చేశారు. వైసీపీ, టీడీపీలకు ఓట్లేస్తే టీడీపీకి ఓట్లేసినట్లేనని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని శ్రేణులకు సూచించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే విభజన హామీలు నెరవేరుతాయని స్పష్టం చేశారు.
తిరుపతి జిల్లాలో ఆదివారం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఒకప్పుడు వైసీపీని తన భుజాలపై వేసుకుని పాదయాత్ర చేశానని.. అండగా నిలబడి అధికారంలోకి తెచ్చినా, ఈ రోజు కనీసం కృతజ్ఞత లేదని అన్నారు. తన మీద, తన వ్యక్తిగత జీవితం మీద వైసీపీ నేతలు నానా రకాలుగా దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. అయినా, ఈ వైఎస్సార్ బిడ్డ భయపడేది కాదని.. పులి కడుపున పులే పుడుతుందని, తన ఒంట్లో ఉన్నది వైఎస్ రక్తం అని పునరుద్ఘాటించారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరుగుతుందని.. పోలవరం, ప్రత్యేక హోదా, రాజధాని వచ్చి ప్రజలకు మేలు కలగాలనే తాను ఇక్కడికి వచ్చినట్లు స్పష్టం చేశారు.
బీజేపీ అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని.. ఇదే తిరుపతిలో నిలబడి ప్రధాని మోదీ మాట ఇచ్చారని, ఆ హామీ ఏమైందని షర్మిల ప్రశ్నించారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మోదీ చేసింది అన్యాయమని.. బీజేపీది కేడీల పార్టీ అని తీవ్ర విమర్శలు చేశారు. ప్రత్యేక హోదా వచ్చి ఉంటే ఏపీకి ఎన్నో పరిశ్రమలు, లక్షల్లో ఉద్యోగాలు వచ్చేవని అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు కాంగ్రెస్ పార్టీ జాతీయ హోదా ఇస్తే.. నిధులు ఇవ్వని వ్యక్తి మోదీ అని మండిపడ్డారు. జగన్ ను విధానాల ప్రకారం అందరూ విమర్శిస్తూంటే..ఆయన మాత్రం బాణాలకు దొరకనని..తాను అర్జునుడినని చెప్పుకుంటూ ప్రచారం చేసుకుంటున్నారు.