పోయే వాళ్లు వెళ్లిపోనీయండి మేం కొత్త లీడర్స్ ను తయారు చేసుకుంటామని కేటీఆర్ గంభీరమైన ప్రకటన చేశారు ఆ స్థాయి నేతల్ని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసినా…. అందరికీ వర్తించేలా ఈ వ్యాఖ్య ఉంది. కానీ ఇక్కడ కేటీఆర్ పోయే వాళ్లను తప్పు పట్టడం కన్నా…. అసలు వాళ్లందర్నీ తన పార్టీలోకి తీసుకోవడం కన్నా అవకాశం వచ్చినప్పుడు తామే నేతల్ని తయారు చేసుకోవడం మంచిది కదా అన్న ఆలోచన చేయలేకపోయారు. ఫలితంగానే ఇప్పుడు ఒక్క పరాజయం రాగానే లీడర్, క్యాడర్ అంతా గుడ్ బై చెప్పేస్తున్నారు. కేటీఆర్ కొత్త లీడర్లను తయారు చేసుకుంటామని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు.
తెలంగాణలో మరో పార్టీ ఉండకూడదన్న లక్ష్యంతో సొంత క్యాడర్ ను డెవలప్ చేసుకోవడం కన్నా ఇతర పార్టీల నేతల్ని చేర్చుకోవడం మీదనే కేసీఆర్, కేటీఆర్ దృష్టి పెట్టారు. గత పదేళ్లలో ఎన్ని పార్టీలను నిర్వీర్యం చేశారో లెక్కే లేదు. చివరికి కమ్యూనిస్టుల్ని కూడా వదిలి పెట్టలేదు. టీడీపీని లేకుండా చేసేశామని సంతోషపడుతున్నారు. కానీ ఆ టీడీపీ లేకపోవడం వల్లనే మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయారన్న విశ్లేషణలు ఉన్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీ ఎల్పీని రెండు సార్లు విలీనం చేసుకున్నారు. కింది స్థాయి నేతల వరకూ చేర్చుకుని వారికే పదవులు ఇచ్చారు. ఫలితంగా బీఆర్ఎస్ క్యాడర్ ఎక్కడా గెలుపొందలేదు. వలస వచ్చిన నేతలే పార్టీ నేతలుగా చెలామణి అయ్యారు.
బెల్లం చుట్టూ మూగే ఈగల్లాగా అధికారం చుట్టూ మూగే నాయకులు ఎప్పుడూ ఉంటారు. వారిని నమ్ముకుని సొంత క్యాడర్ ను బలోపేతం చేసుకో వడంపై విఫలమయి .. ఇప్పుడు అధికారం పోయిన తర్వాత సొంత లీడర్లను డెవలప్చేసుకుంటామంటే…. ఎవరికి ఓపిక ఉంటుంది. అధికారంలో ఉన్నప్పుడు తమను పట్టించుకోని నాయకత్వం ప్రతిపక్షంలో ఉన్పన్పుడు మాత్రం ముందు పెట్టి పోరాటం చేస్తుందని.. తీరా గెలిస్తే మళ్లీ ప్యారాచ్యూట్ లీడర్లకు ప్రాధాన్యమివ్వరన్న గ్యారంటీ ఏమిటని ఎక్కువ మంది మాట. ఇప్పుడీ బాధ బీఆర్ఎస్కు ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది. ఎందుకంటే.. గొప్ప అవకాశాన్ని మిస్ చేసుకుని.. ఇతర పార్టీల నేతల్ని ఆకర్షించుకుని.. సొంత క్యాడర్ ను పెంచుకోలేకపోయారు. ఇప్పుడు అధికారం పోగానే వారిలో ఎక్కువ మంది ఎవరి దారి వారు చూసుకుంటున్నారు