తండ్రి హత్య నిందితులకు శిక్ష పడేంత వరకూ అవిశ్రాంత పోరాటం చేసేందుకు సిద్ధమైన వైఎస్ వివేకా కుమార్తె సునీతా రెడ్డి రాజకీయంగానూ వారిని దెబ్బకొట్టాలన్న ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. వివేకా హత్య కేసులో పోరాటానికి మద్దతుగా నిలిచిన షర్మిలతో కలిసి నడిచేందుకు సునీతారెడ్డి కూడా రెడీ అయినట్లుగా తెలుస్తోంది. జిల్లాల పర్యటనలు చేస్తూ ఇడుపులపాయ చేరుకోనున్న షర్మిలను.. సోమవారం సునీత భేటీ అయ్యే అవకాశం ఉంది.
షర్మిలకు తోడుగా రాజకీయ పయనం చేయాలని.. తన తండ్రిని చంపేసిన హంతకులకు రాజకీయ భవిష్యత్ లేకుండా చేయాలని సునీత పట్టుదలగా ఉన్నారు. ఈ మేరకు ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలున్నాయని చెబుతున్నారు.. సునీత లేదా ఆమె తల్లి పార్లమెంట్ స్థానానికి పోటీ చేసే అవకాశం ఉంది. కడప పార్లమెంట్ స్థానం నుంచి మరోసారి అవినాష్ రెడ్డికే జగన్ రెడ్డి టిక్కెట్ ఖరారు చేస్తారని చెబుతున్నారు. అందుకే ఆయనపై పోటీకి సునీత రెడీ అవుతున్నట్లుగా చెబుతున్నారు.
ఇడుపులపాయలో చర్చల తర్వాత సునీత కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. షర్మిల సమక్షంలో పార్టీలో చేరే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇవాళ చేరకపోతే.. కడపలో పెద్ద సభ పెట్టి ఆ సభ సాక్షిగా చేరే అవకాశాలు కూడా ఉన్నాయని కూడా అంచనా వేస్తున్నారు. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో షర్మిల, సునీత ఇద్దరూ పోటీలో ఉంటారన్న సంకేతాలు వస్తున్నాయి.