విజయ్ దేవరకొండ – గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్లో ఓ చిత్రం సెట్స్‌పైకి వెళ్లాల్సివుంది. అయితే… ఇప్పటి వరకూ ఈ సినిమాపై అప్ డేట్ లేదు. దాంతో ఈ సినిమా ఉంటుందా, ఉండదా? అనే విషయంపై చాలా అనుమానాలు మొదలైపోయాయి. చివరికి నిర్మాత నాగవంశీ ఈ ప్రాజెక్ట్ పై క్లారిటీ ఇచ్చారు. ‘ఫ్యామిలీ స్టార్ షూటింగ్ పూర్తవగానే విజయ్ దేవరకొండ సినిమా పట్టాలెక్కుతుంద’ని ఆయన స్పష్టం చేశారు.
ఈలోగా ఇదే బ్యానర్లో గౌతమ్ తిన్ననూరి ఓ చిన్న సినిమా పూర్తి చేశారు. అదే… ‘మ్యాజిక్’. నలుగురు టీనేజర్ల చుట్టూ తిరిగే కథ ఇది. కాలేజీ నేపథ్యంలో సాగుతుంది. కాలేజీ ఫెస్ట్ కోసం ఓ ఆల్బమ్ ని తయారు చేయడానికి నలుగురు స్నేహితులు ఏం చేశారన్నది కథ. సంగీతానికి అధిక ప్రాధాన్యం ఉంది. ఈ చిత్రానికి అనిరుథ్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ముగ్గురు హీరోలు, ఓ హీరోయిన్. అందరూ కొత్తవాళ్లే. ఈ యేడాది వేసవిలో ఈ చిత్రం విడుదల కానుంది. త్వరలోనే టీజర్ రిలీజ్ చేయనున్నారు.