వైసీపీకి మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కూడా దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. నియోజకవర్గంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తాను మైలవరంలో పోటీ చేయడంపై తానేమి చెప్పలేనన్నారు. త్వరలో సీఎం స్పష్టత ఇస్తారన్నారు. మైలవరంలో పోటీపై త్వరలో అన్ని విషయాలు తెలియజేస్తానని వచ్చే నెల 4 లేదా 5న ప్రెస్మీట్ పెట్టి తన మనోభావాలు తెలియజేస్తానని ప్రకటించారు. అభివృద్ధి విషయానికి వచ్చేసరికి గొంతులో వెలక్కాయ పడ్డట్లు ఉందని.. – సంక్షేమ పథకాల వల్ల అభివృద్ధికి నిధులు లేవన్నారు.
అభివృద్ధి లేదనే జనం మాటలు అబద్ధమని తాను అననని స్పష్టం చేశారు. తినగా తినగా పంచదార చేదు అన్నట్లు సంక్షేమ పథకాల చేదయ్యాయని.. పథకాలు కాదు.. అభివృద్ధి కావాలంటున్నారని వాపోయారు. రెండు రోజు కిందట వైసీపీ క్యాడర్ కు బిల్లులు రాక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆస్తులు అమ్ముకుంటున్నారని ఆయన విమర్శలు చేశారు. అంతకు ముందే ఆయన చాలా రోజుల నుంచి టీడీపీలో చేరుతారన్న ప్రచారం జరిగింది. కానీ దేవినేని ఉమతో ఆయనకు రాజకీయ శత్రుత్వం తీవ్రంగా ఉంది.
ఇటీవల మైలవరం లో వసంత కృష్ణ ప్రసాద్ కు టిక్కెట్ నిరాకరించారని ప్రచారం జరిగింది. దీంతో ఆయన అసహనానికి గురై వసంత కృష్ణ ప్రసాద్ కొంత కాలం కనిపించకుండా పోయారు. సీఎంవో పిలిచినా వెళ్లలేదు. చివరికి బుజ్జగించారు. అయితే.. ఇప్పుడు మళ్లీ రివర్స్ లో పోటీ చేస్తానో లేదో చెప్పలేనని.. ఫిబ్రవరి మొదటి వారంలో కీలక ప్రకటన చేస్తానని చెబుతున్నారు.