సంక్రాంతి రేసు నుంచి తప్పుకొన్న ఈగల్ చిత్రానికి సోలో రిలీజ్ డేట్ ఇస్తామని ఛాంబర్ తరపున దిల్ రాజు మాట ఇచ్చిన సంగతి తెలిసిందే. దానికి తగ్గట్టుగానే ఫిబ్రవరి 9న ఈగల్ చిత్రాన్ని విడుదల చేయడానికి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్ణయించింది. అయితే అదే రోజున యాత్ర 2, ఊరి పేరు భైరవ కోన, లాల్ సలామ్ విడుదలకు రెడీ అయ్యాయి. యాత్ర 2 ని వాయిదా వేయడం కుదరదని ఆయా నిర్మాతలు చెప్పేశారు. లాల్ సలామ్ ఓ డబ్బింగ్ సినిమా. దాన్ని ఆపడం కష్టమే. ఇప్పుడు మిగిలింది ఊరి పేరు భైవరకోన. ఇప్పుడు ఈ చిత్రం వాయిదా పడింది. ఫిబ్రవరి మూడో వారంలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాత రాజేష్ దండా ఒప్పుకొన్నారు. దాంతో ఊరి పేరు భైరవకోన… ఈగల్ చిత్రానికి దారి ఇచ్చినట్టైంది.
యాత్ర 2 రాజకీయ కారణాల దృష్ట్యా విడుదల కాక తప్పడం లేదని, లాల్ సలామ్ వచ్చినా తమకు ఇబ్బంది లేదని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చెప్పిందని, అందుకే భైవర కోన నిర్మాతని సినిమా వాయిదా వేసుకోమని కోరామని, దానికి నిర్మాత రాజేష్ దండా ఒప్పుకొన్నారని ఫిల్మ్ ఛాంబర్ ఓ ప్రకటనలో పేర్కొంది. దీనిపై ఓ ప్రెస్ మీట్ కూడా పెట్టారు. సంక్రాంతి తరవాత జరిగిన పరిణామాల్ని దిల్ రాజు మీడియాకు వివరించారు. ఈగల్ సంక్లిష్టమైన పరిస్థితుల్లో వాయిదా పడిందని, ఆ చిత్రానికి సోలో రిలీజ్ ఇవ్వాల్సిన బాధ్యత చాంబర్పై ఉందని, అయితే యాత్ర 2 విడుదల ఆపలేకపోయామని, లాల్ సలామ్ విషయంలోనూ అదే జరిగిందని దిల్ రాజు వ్యాఖ్యానించారు.