తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కారు కొలువు తీరాక… టాలీవుడ్ లోని ప్రముఖులు ఆయన్ని విడివిడిగా కలిశారు. చిత్రసీమ తరపున ఓ బృందం వెళ్లి, ఆయనకు సమస్యలు చెప్పుకోవాలని, వాటికి పరిష్కారాలు కనుగొనాలని చాలా రోజుల నుంచీ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎట్టకేలకు ఇవన్నీ ఓ కొలిక్కి వచ్చాయి. ఛాంబర్ తరపున ఓ బృందం రేవంత్ రెడ్డితో ములాఖాత్ అయ్యింది. చిత్రసీమ సమస్యల్ని రేవంత్ రెడ్డి ముందు ఉంచారు. వాటిపై రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు కూడా. ‘పరిష్కార మార్గాలు కూడా మీరే చెప్పండి..’ అంటూ ఆ బృందానికి సూచించారు రేవంత్. త్వరలోనే మరోసారి సీ.ఎంతో ఓ మీటింగ్ ఏర్పాటు చేయించుకొని, అప్పుడు మరింత వివరంగా ఈ అంశం గురించి మాట్లాడాలని టాలీవుడ్ ప్రతినిధులు భావిస్తున్నారు. ఈ విషయాన్ని దిల్ రాజు మీడియా ముఖంగా తెలియజేశారు.
”చిత్రసీమ నుంచి ఓ బృందం ముఖ్యమంత్రిని కలిసింది. దాదాపు గంట సేపు సాగిన ఈ సమావేశంలో చిత్రసీమలోని సమస్యల గురించి చర్చించారు. వాటిపై రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. సమస్యలే కాదు, పరిష్కార మార్గాలు కూడా మీరే చెప్పండన్నారు. ఏ సమస్య ఉన్నా పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇవ్వడం సంతోషంగా ఉంది. రెండు రోజుల్లో టాలీవుడ్ నిర్మాతలు ఓ సమావేశం ఏర్పాటు చేస్తాం. అందులో సీఎం దృష్టికి ఏయే విషయాల్ని తీసుకెళ్లాలన్న విషయం గురించి సవివరంగా చర్చిస్తాం” అని దిల్ రాజు పేర్కొన్నారు. ఏపీలో చిత్రసీమ పట్ల చిన్నచూపు ఉంది. కేసీఆర్ కూడా టాలీవుడ్ ని పెద్దగా పట్టించుకోలేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాస్త చొరవ చూపిస్తే.. టాలీవుడ్ లో ఎంతోకాలంగా పెండింగ్ లో ఉన్న సమస్యలన్నింటికీ ఓ పరిష్కారమార్గం దొరికినట్టే.