కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీలో రెండు నెలలలోపే ఎన్నో అంతర్గత సమస్యలు ఎదుర్కొంంది. అక్కడ కూడా గ్రూపు రాజకీయాలు ఎక్కువ. తెలంగాణలో కూడా అదే పరిస్థితి. కానీ రేవంత్ చాలా స్మూత్ గా వ్యవహారాలను డీల్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఐఎఎస్,ఐపిఎస్, దిగువస్ధాయి పోలీసు అధికారుల పోస్టింగ్‌లు, పదోన్నతులు, భూముల వివాదాలు వంటి విషయంలో ఎక్కడా పార్టీ నేతల్ని కూడా నొప్పించకుండా.. అలాగని పైరవీలకు తలొగ్గకుండా పని చేసుకుంటూ పోతున్నారు.
టిఎస్పిఎస్సి చైర్మన్‌గా కెసిఆర్ ప్రభుత్వంలో డిజిపిగా పనిచేసిన మహేందర్‌రెడ్డిని నియమించారు. ఆయన కేసీఆర్ కు సన్నిహితుడు. తెలంగాణ ఏర్పాటు నుంచి రిటైరయ్యే వరకూ డీజీపీగా ఉన్నారు. అయినా నియామకంపై ఎక్కడా వ్యతిరేకత రాలేదు. రాజకీయ ఒత్తిడులకు అతీతంగా సీనియర్లతో సంప్రదించి వివిధ వర్గాల నుంచి వచ్చే ఫీడ్‌బ్యాక్ ఆధారంగా పోస్టింగులు ఇస్తున్నారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేవి భూముల డీలింగ్స్, ఇలాంటి ల్యాండ్ లిటిగేషన్ల దరిదాపులకు తాను వెళ్లకుండా మిగతా వారిని కూడా దూరంగా ఉండమని సూచిస్తున్నారు.
ఇక విధానపరమైన నిర్ణయాల విషయాల్లో కూడా ఆయన తొందరపాటు ప్రదర్శించడం లేదు. పరిస్థితుల్ని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఉద్యోగులకు ఒకటో తేదీ జీతాలిస్తున్నారు. నిధుల అందుబాటును బట్టి రైతుబంధు నిధులు రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. నామినేటెడ్ పదవుల విషయంలోనూ లౌక్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాలను గవర్నర్ తమిళిసై అంగీకరించేలా చేయడంలో ఆయన అంతులేని లౌక్యాన్ని ప్రదర్శించారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. గతంలో తమిళిసై ప్రభుత్వ ప్రతిపాదనలు అనేకం పెండింగ్‌లో పెట్టారు. ఎంఎల్సిలుగా ప్రొ.కోదండరాం, అమీర్ అలీఖాన్ ఎంపిక సులభమయ్యేలా సఫలీకృతమయ్యారు.
కేంద్రంతో కూడా ఘర్షణ పూరిత వైఖరి కాకుండా సయోధ్యతో వ్యవహరిస్తూ మెహదీపట్నంలో ప్రధాన సమస్యగా ఉన్న స్కైవాక్ నిర్మాణానికి ప్రధాన ఆటంకంగా ఉన్న రక్షణ శాఖ భూములను అప్పగించేలా చేయడంలో విజయవంతమయ్యారు. మెట్రో రెండో దశ విస్తరణలోనూ ఆయన రియల్ ఎస్టేట్ ప్రయోజనాలకు పెద్దపీట వేయలేదు. లోక్‌సభ ఎన్నికలు జరిగే ఏప్రిల్‌లోపు, ఎన్నికల కోడ్ వచ్చేలోపు మరికొన్ని హామీలు అమలు చేయడం ద్వారా ప్రజల విశ్వాసం పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.