ఏపీలో టీడీపీ, జనసేన మధ్య సీట్ల సర్దుబాటు త్వరలో ఫైనల్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే రెండు పార్టీల మధ్య పలుమార్లు చర్చలు జరిగాయి. చంద్రబాబు, పవన్ కూడా రెండు సార్లు సమావేశం అయ్యారు. ఎవరు ఎన్ని సీట్లలో పోటీ చేయాలి.. ఏ ఏ సీట్లలో పోటీ చేయాలన్న అంశంపై ఇప్పటికే ప్రాథమికంగా వారు ఓ అవగాహనకు వచ్చినట్లగా తెలుస్తోంది. ఫిబ్రవరిలోనే ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉన్నందున మొదటి వారంలో సీట్ల సర్దుబాటు ప్రకటన చేస్తే.. తర్వాత అసంతృప్తుల్ని బుజ్జగించవచ్చని అనుకుంటున్నారు. ఎ పవన్ కల్యాణ్ ఇటీవల రెండు సీట్లు తమ పార్టీ తరపునపోటీ చేస్తున్నామని ప్రకటించారు. అందులో ఒకటి రాజోలు, రెండోది రాజా నగరం. అంతకు ముందు చంద్రబాబునాయుడు ప్రచార సభల్లో మండపేట, అరకులనుంచి అభ్యర్థుల్ని ప్రకటించారు.
ఇది జనసేన పార్టీలో భిన్నాభిప్రాయాలకు కారణం అయింది. పొత్తులో ఉండి ఇలా ఏకపక్షంగా సీట్లు కేటాయించుకుని అభ్యర్థుల్ని ప్రకటించుకోవడం ఏమిటని పార్టీ క్యాడర్ అసంతృప్తి వ్యక్తం చేయడంతో పవన్ సర్ది చెప్పారు. తాను కూడా రెండు సీట్లకు అభ్యర్థుల్ని ప్రకటించారు. నిజానికి టీడీపీ, జనసేన ఎవరెవరు ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలన్న అంశంపై ఇప్పటికే ఓ అవగాహనకు వచ్చాయని.. అంతర్గతంగా ఏ ఏ సీట్లు అన్నది కూడా ఖరారు చేసుకున్నారని అంటున్నారు. అభ్యర్థుల అంశంపైనా ఓ అంచనాకు వచ్చారని చెబుతున్నారు. అయితే బీజేపీతో జనసేన పార్టీ చర్చలు జరుపుతోంది.
తాము, జనసేన పార్టీ పొత్తులో ఉన్నామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇలాంటి సమయంలో అధికారికంగా పొత్తుల ప్రకటన చేయడంలో ఆలస్యం అవుతుంది. అన్నీ అంశాలపై క్లారిటీ తె్చ్చుని ఫిబ్రవరి మూడు లేదా ఆ తర్వాత ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ లోపు మరోసారి చంద్రబాబు, పవన్ భేటీ కానున్నారు.