తెలంగాణ మాజీ సీఎస్ సోమేష్ కుమార్ నిండా మునిగిపోతున్నారు. ఆయన ధరణి మాస్టర్ మైండ్. ఆ క్రమంలో ఆయన చేసిన దురాగతాలు ఇంకా పూర్తిగా బయటకు రాలేదు. కానీ ఆయన మాత్రం పాతిక ఎకరాలు కొనుగోలు చేసిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ శివారులో ఎకరం రెండు లక్షలు పెట్టి ఆయన ఏకంగా పాతిక ఎకరాలను కొనుగోలు చేశారు. ఈ డాక్యుమెంట్లు బయటకు వచ్చాయి.
అడవిలో కూడా ఎకరం రెండు లక్షలు లేదని.. అలాంటిది హైదరాబాద్ శివారులో ఎలా ఉంటుందని.. ఇందులో గూడుపుఠాణి ఏమిటో బయటకు లాగాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. సోమేష్ కమార్ నాటి ప్రభుత్వ పెద్దలకు అత్యంత సన్నిహితులు. పదిహేను మంది సీనియర్లు ఉన్నప్పటికీ అందర్నీ కాదని ఆయనకు సీఎస్ పోస్ట్ ఇచ్చారు కేసీఆర్. కోర్టు తీర్పు కారణంగా ఆయన ఏపీ సర్వీసుకు వెళ్లాల్సి వస్తే వెంటనే వీఆర్ఎస్ తీసుకుని సలహాదారుగా నియమితులయ్యారు. కొత్త సచివాలయంలో ఆయనకు విశాలమైన చాంబర్ ఉండేది. భూ వ్యవహారాలన్నీ ఆయనేచూస్తారని చెబుతారు. ఇప్పుడు ఈ భూముల లావాదేవీల వెనుక రహస్యాలన్నింటినీ వెలుగులోకి తెచ్చేందుకు ఏసీబీ అధికారులు రెడీ అవుతున్నారు.
వైట్ గా కట్టింది యాభై లక్షలు కావొచ్చు కానీ.. కోట్లకు కోట్లు బ్లాక్ మనీ కట్టి ఉంటారని ఆ సొమ్మంతా ఎక్కడి నుంచి వచ్చిందో వెలుగులోకి తెచ్చే అవకాశం ఉంది. ఇది సోమేష్ కుమార్ లీలల్లో .. ఒక్క శాతమేనని ఇంకా చాలా బయటకు వస్తాయని.. కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.