ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలయ్యేలోగా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మొత్తం ఖాళీ అయిపోతుందని చెప్పారే! జగన్ తప్ప ఆ పార్టీలోని అందరూ 5వ తేదీలోగా తెదేపా తీర్థం పుచ్చుకుంటారని జోస్యాలు పలికారే! వైఎస్సార్ కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా ఈ అసెంబ్లీతోనే పోతుందని, అనగా 17 కంటె తక్కువ మంది సభ్యులు అయిపోతారని అర్థం వచ్చేలా తమ ధీమాను వ్యక్తం చేశారే..! అవన్నీ డొల్ల మాటలు అని తేలిపోయాయి. మొత్తానికి వైకాపానుంచి వచ్చిన వారు ఇప్పటికి 8 మంది మాత్రమే అని లెక్క తేలింది. అయితే ఇంకా వైకాపానుంచి వచ్చే అవకాశం ఉన్న ఎమ్మెల్యేలు చాలా మందే ఉన్నారు. ఎప్పుడు అనేది మాత్రం తెలియడం లేదు.
అయితే ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు మంగళవారం నుంచి ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో.. ఈ సమావేశాల సమయంలోనే వైకాపా సభ్యులు ఇంకా ఎంత మంది పార్టీ ఫిరాయించబోతున్నారో ఒక క్లారిటీ వచ్చేస్తుందని అంతా అనుకుంటున్నారు. ఈ నెలాఖరు వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. ఈ సమావేశాల్లో వైకాపా సభ్యులు వ్యవహరించే తీరును బట్టి, ప్రభుత్వం మీద దాడి చేయడంలో వారు కనబరిచే దూకుడును బట్టి.. వారు పార్టీ మారేది లేనిది తేలిపోతుందని పలువురు ఊహిస్తున్నారు.
ఒక రకంగా ఇది నిజం కూడా! గత అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ‘కాల్‌మనీ’ వ్యవహారాన్ని తీవ్రంగా ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ఒకవైపు ఆ పార్టీ నాయకులంతా ఎడా పెడా తెలుగుదేశాన్ని తిట్టిపోస్తూ ఉంటే.. జలీల్‌ఖాన్ లాంటి వాళ్లు చాలా మౌనంగా ఉండడమూ లేదా, వారిని వెనక్కు లాగడమూ లాంటి పాత్రలు అప్పుడు సభలో పోషించారు. అప్పట్లో సభ జరిగిన తీరును గమనించిన వారికి ఎవరికైనా ఇదంతా గుర్తుండే ఉంటుంది. ఆ తర్వాత మళ్లీ అసెంబ్లీ సమావేశాలు వచ్చే సమయానికి ఇప్పుడు జలీల్‌ఖాన్ లాంటి వాళ్లు తెదేపాలోనే ఉన్నారు. తెదేపా సీట్లలోనే కూర్చుంటున్నారు.
అదే క్రమంలో ఈ సారి సభలో కూడా.. వైకాపా వారిలో ప్రభుత్వం మీద దాడిచేయడంలో కాస్తంత మెతగ్గా వ్యవహరించే వారంతా.. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోగా ఫిరాయించడానికి ఇంకా మంతనాలు ఆడుతున్న వారే అని భావించవచ్చు. పైగా ఇటీవల జగన్ నిర్వహించిన ఎమ్మెల్యేల సమావేశానికి డుమ్మా కొట్టిన 13 మంది మరియు ఆయనకే సలహాలు చెప్పి సంచలనం సృష్టించిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలు సభలో ఎలా ప్రవర్తిస్తారు? అనే దాని మీద కూడా పరిశీలకుల దృష్టి తప్పకుండా ఉంటుంది. ఎటొచ్చీ ఈ సభాపర్వం పూర్తయిన తర్వాత.. తెదేపాలోకి మరికొన్ని చేరికలో ఉండడం మాత్రం గ్యారంటీ. కాకపోతే.. ఈ సభాసమయంలోనే దానికి సంబంధించిన సంకేతాలు కూడా అందుతాయని అనుకోవాలి.