శుభారంభం సగం బలం అంటారు పెద్దలు. సుదీర్ఘ ప్రయాణంలో వేసే తొలి అడుగులు చాలా కీలకమైనవి. గమ్యం చేరడానికి కావల్సిన ధైర్యాన్నీ, భరోసానీ, ఉత్సాహాన్నీ అందించేవి ఆ అడుగులే. టాలీవుడ్ కూడా 2024 ప్రయాణంలో తొలి అడుగుల్ని పూర్తి చేసుకొంది. జనవరిలో తెలుగు చిత్రసీమ కొత్త సినిమాలతో కళకళలాడింది. వాటిలో విజయాలు ఉన్నాయి, పరాజయాలూ కనిపించాయి.
జనవరి నెలంతా సంక్రాంతి సినిమాలతో హడావుడిగా సాగిపోయింది. 4 సినిమాలు ఈ సంక్రాంతి సీజన్లో పోటీ పడ్డాయి. ధియేటర్ల గోల, రవితేజ సినిమా పోటీ నుంచి తప్పుకోవడంతో – ఈ సంక్రాంతిపై మరింత ఎటెన్షన్ పెరిగింది. 12న రెండు సినిమాలొచ్చాయి. వాటిలో ‘హనుమాన్’ అనూహ్య విజయాన్ని అందుకొంది. కావల్సినన్ని ధియేటర్లు లేకపోయినప్పటికీ, మెల్లమెల్లగా మౌత్ టాక్‌తో – టాలీవుడ్ మొత్తాన్ని ఆక్రమించుకొంది హనుమాన్. ఈ సినిమా ఏకంగా రూ.250 కోట్లు సాధించి, ఆల్ టైమ్ రికార్డ్స్ జాబితాలో చోటు సంపాదించుకొంది. హనుమాన్ హవా ఇంకా కొనసాగుతూనే ఉంది. భారీ అంచనాలతో విడుదలైన ‘గుంటూరు కారం’ అభిమానుల్ని అంతగా మెప్పించలేకపోయింది. కథ, కథనాలు రొటీన్‌గా సాగడం, మహేష్ క్యారెక్టర్ని తప్ప, ఏ పాత్రనీ సరిగా డిజైన్ చేయలేకపోవడంతో ఆ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. కాకపోతే సంక్రాంతి సీజన్లో విడుదల కావడం అతి పెద్ద ప్లస్ పాయింట్. ఈ సినిమాని కావాలని తొక్కేశారని, నెగిటీవ్ రివ్యూల వల్ల ఇంపాక్ట్ పడిందని నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి మరీ వాపోయారు. బుక్ మై షోలో ఫేక్ రివ్యూలు ఇస్తున్నారని కేసులు పెట్టారు. మొత్తానికి వసూళ్లతోనే కాకుండా, వివాదాలతోనూ ‘గుంటూరు కారం’ పేరు మార్మోగింది.
ఈ సంక్రాంతికి ఇద్దరు సీనియర్ హీరోలు వెంకటేష్, నాగార్జున కూడా అలరించారు. వెంకటేష్ ‘సైంధవ్’ పూర్తిగా సీరియస్ సబ్జెక్ట్. ఎమోషన్, యాక్షన్ డ్రామా. ఈ సంక్రాంతి సినిమాల్లో అత్యంత తక్కువ వసూళ్లు దానికే దక్కాయి. వెంకీ 75వ సినిమా ఫ్లాప్ గా మిగిలిపోవడం దగ్గుబాటి అభిమానుల్ని నిరాశ పరిచింది. నాగార్జున మాత్రం ‘నా సామిరంగ’తో వినోదాన్ని పంచి పెట్టారు. సంక్రాంతి వైబ్స్ నిండిన సినిమా ఇది. దాంతో.. ఆడియన్స్ బాగా కనెక్ట్ అయిపోయారు. నరేష్ పాత్ర కూడా బాగానే కుదిరింది. మొత్తంగా నాగ్ పరాజయాల పరంపరకు ఈ సంక్రాంతితో బ్రేక్ పడింది.
సంక్రాంతికి ముందూ, ఆ తరవాత తెలుగులో సినిమాలేం రాలేదు. చివరి వారంలో డబ్బింగ్ సినిమా ‘కెప్టెన్ మిల్లర్’ వచ్చింది కానీ ఏమాత్రం ప్రభావం చూపించలేదు. ‘అయలాన్’ కూడా విడుదల కావాల్సింది. కానీ… ఆర్థిక కారణాల వల్ల చివరి నిమిషంలో వాయిదా పడింది. ఫిబ్రవరిలో కొత్త సినిమాల జోష్ బాగానే కనిపిస్తోంది. తొలివారంలోనే 8 చిత్రాలు విడుదలకు క్యూ కట్టాయి. రెండో వారంలో రవితేజ ఈగల్ వస్తోంది. యాత్ర 2, ఆపరేషన్ వాలెంటైన్, ఊరిపేరు భైవరకోన, ట్రూ లవర్, సిద్దార్థ రాయ్ ఫిబ్రవరి నెలలోనే రాబోతున్నాయి.