రాజకీయంగా జోరు పెంచిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డికి సెక్యూరిటీ తీసేశారు. గతంలో ఫోర్ ప్లస్ ఫోర్ సెక్యూరిటీ ఉండేది. ఇప్పుడు వన్ ప్లస్ వన్ చేశారు. దీనిపై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. సీడబ్ల్యూసీ మెంబర్ రఘువీరారెడ్డి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణం భద్రతను ఫోర్ ప్లస్ ఫోర్‌కు పెంచాలని, పోలీస్ ఎస్కార్ వెహికల్‌ను కేటాయించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. వచ్చే ఎన్నికలు, వైసీపీ నేతల బెదిరింపుల కారణంగా తగిన భద్రతను కల్పించాలన్న డిమాండ్లు కొంత కాలంగా ఇతర పార్టీల నుంచి వస్తున్నాయి.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత షర్మిల జోరు పెంచారు. ప్రతిపక్షాలు కంటే అధికారంలో ఉన్న తన అన్నపైనే తీవ్ర స్థాయిలో ఆమె వ్యాఖ్యలు చేస్తున్నారు. వైసీపీ సోషల్ మీడియా కూడా అంతే స్థాయిలో షర్మిలపై విమర్శలు గుప్పిస్తున్నారు. మరి కొంత మంది వైసీపీ నాయకులు ముందుకు వచ్చి షర్మిలపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ, వైసీపీ మధ్య రోజురోజుకూ అగ్గి రాజుకుంటోంది. వ్యక్తిగత విమర్శలు తారాస్థాయికి చేరిన నేపథ్యంలో.. రానున్న రోజుల్లో మరింత ఇబ్బందికర పరిస్థితి ఉంటుందని అంతా భావిస్తున్నారు. మరి కొద్ది రోజుల్లో షర్మిలారెడ్డి రాష్ట్ర వ్యాప్త పర్యటనకు సిద్ధమవుతున్నారు.
జగన్‌పై విమర్శలు చేసిన నేపథ్యంలో వైసీపీ శ్రేణులు నుంచి ఇబ్బందులుంటాయనో, ఇతర గొడవలకు ఆస్కారం ఇవ్వకూడదన్న ఉద్ధేశంతోనో షర్మిల భధ్రత పెంపుపై డీజీపీకి లేఖ రాసినట్టు చెబుతున్నారు. దీనివల్ల కాంగ్రెస్ పార్టీ నిర్వహించే సమావేశాలు సజావుగా సాగే అవకాశముందని పేర్కొంటున్నారు. అందుకే తొలగించిన భద్రత కల్పించాలని కోరుతున్నారు. ఈ ఆరోపణలపై డీజీపీ స్పందిస్తారో లేదో మరి.