మాజీ మంత్రి రావెల కిషోర్ వైసీపీలో చేరారు. బీఆర్ఎస్ పార్టీలో చేరిన ఆయన ఆ తర్వాత ఎక్కడా కనిపించలేదు. కొద్ది రోజుల కిందట అయోధ్య రామిరెడ్డితో చర్చలు జరిపారు. ఇప్పుడు వైసీపీలో చేరిపోయారు. పత్తిపాడు టిక్కెట్ హామీ తీసుకుని వైసీపీలో చేరినట్లుగా తెలుస్తోంది. పత్తిపాడు సిట్టింగ్ ఎమ్మెల్యే సుచరితను తాడికొండకు మార్చారు. పత్తిపాడుకు కొత్త అభ్యర్థిని పెట్టారు. బాలసాని కిరణ్ అనే నేతను నియమించారు. ఆయన ఎవరో నియోజకవర్గంలో ఎవరికీ తెలియదు.
ఆయన తిరగడం ప్రారంభించిన తర్వాత చాలా మంది వ్యతిరేకించడం ప్రారంభించారు. ఏ ఉద్దేశంతో బాలసాని కిరణ్ ను ఇంచార్జ్ గా చేశారో కానీ వెంటనే సీఎం జగన్ మనసు మార్చుకున్నారు. ఆయన వల్ల కాదని కొత్త అభ్యర్థిని వెదకాలనుకున్నారు. అనుకున్నదే తడవుగా అక్కడ్నుంచి గతంలో టీడీపీ తరపున పోటీ చేసి గెలిచి మంత్రిగా కూడా చేసిన ఆయన.. తర్వాత టీడీపీకి దూరమయ్యారు. టిక్కెట్ కూడా ఇవ్వకపోవడంతో జనసేనలో చేరారు. మళ్లీ బీజేపీలో చేరారు. తర్వాత ఆ పార్టీకి రాజీనామా చేశారు. టీడీపీలో చేరేందుకు ప్రయత్నించినా ఎవరూ పట్టించుకోలేదు.
తర్వాత కేసీఆర్ నుంచి పిలుపు రావడంతో బీఆర్ఎస్ లో చేరారు. ఏ ముహుర్తాన చేరాలో కానీ.. కేసీఆర్ అనేక సమస్యల్లో పడ్డారు. చివరికి ఆయన ఇతర రాష్ట్రాల్ోల పార్టీని పట్టించుకునే పరిస్థితి లేకుండాపోయింది. ఇప్పుడు వైసీపీ పిలిచి టిక్కెట్ ఇచ్చేందుకు సిద్ధపడటంతో ఆయన ఆఘమేగాలపై పార్టీలో చేరిపోయారు.