టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ వచ్చింది. దీనిపై రకరకాల వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. బీజేపీలో చేరే ఒప్పందంపైనే ఆయనకు పద్మ విభూషణ్ ఇచ్చారని త్వరలో ఆయన పార్టీలో చేరితే యూపీ నుంచి రాజ్యసభకు పంపుతారన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఇవన్నీ ఫేక్ వార్తలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. చిరంజీవికి పద్మ విభూషణ్ ఇచ్చింది ఆయన బీజేపీలో చేరతారని కాదని స్పష్టం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనేక మందికి పద్మ అవార్డులు ఇచ్చిందని, వారందరూ బీజేపీలోకి వస్తారని అవార్డులు ఇవ్వలేదన్నారు.
బీజేపీ ప్రభుత్వం ఎక్కడా కూడా పద్మ అవార్డుదారులను పార్టీలోకి ఆహ్వానించలేదని తెలిపారు. గుర్తింపునకు నోచుకోని కవులు, కళాకారులను గౌరవించాలన్న ఉద్దేశంతో ఇటీవల కేంద్రం పద్మ శ్రీ పురస్కారాలు ప్రకటించిందని, కొందరికి పద్మ భూషణ్, పద్మ విభూషణ్ ప్రకటించిందని, వారందరూ బీజేపీలోకి వస్తారని అవార్డులు ఇచ్చామన్న వాదన అర్థరహితం అన్నారు. ఇది ప్రజాస్వామ్యం అని, ఎవరు ఏ పార్టీలో అయినా చేరొచ్చని కిషన్ రెడ్డి అన్నారు.
చిరంజీవిని బీజేపీకి ఆపాదిస్తూ ఇటీవలి కాలంలో చాలా సార్లు ప్రచారాలు జరిగాయి. గతంలో అనురాగ్ ఠాకూర్ నేరుగా చిరంజీవినే అడిగారు. అయితే చిరంజీవి మాత్రం తాను ఇక ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేదే లేదని స్పష్టం చేశారు. ఆయినా ఆయనును ఆకర్షించేందుకు అదే పనిగా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రచారాలు జరుగుతూనే ఉన్నాయి.