చలన చిత్ర పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం అందించే నంది అవార్డుల పేరు మారింది. ఈ పురస్కారాలకు ‘గద్దర్ అవార్డులు’ అని నామకరణం చేసింది తెలంగాణ సర్కారు. ఈరోజు గద్దర్ జయంతి. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. చాలాకాలంగా నంది అవార్డుల ప్రదానం జరగడం లేదు. కేసీఆర్ సర్కారు వచ్చిన కొత్తలో ‘సింహా’ పేరుతో అవార్డులు ఇస్తామన్నారు. పదేళ్లలో ఒక్కసారి కూడా `సింహా` అవార్డుల గురించి కేసీఆర్ సర్కారు పట్టించుకోలేదు. ఇప్పుడు తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. చిత్రసీమ కూడా నంది అవార్డులు ఇవ్వడం లేదన్న విషయాన్ని రేవంత్ రెడ్డి ముందుకు తీసుకెళ్లింది. నందిని పునరుద్ధరిస్తామని రేవంత్ రెడ్డి చిత్రసీమకు మాట ఇచ్చారు. అన్నట్టుగానే తొలి అడుగు వేశారు. ఓ కళాకారుడి పేరుతో అవార్డులు స్థాపించి, చిత్రపరిశ్రమకు ఇవ్వాలనుకోవడం స్వాగతించాల్సిన పరిణామమే. ఇక ఈ విషయంలో మేల్కోవాల్సింది ఏపీ ప్రభుత్వమే. జగన్ రెడ్డి సర్కారు ఉన్నంత కాలం… చిత్రసీమకు మొండి చేయే ఎదురైంది. త్వరలో జరుగుతున్న ఎన్నికలలో ప్రభుత్వం మారితే – కచ్చితంగా టాలీవుడ్ కు ‘నంది’లో మళ్లీ నంది పురస్కారాల కళ రావొచ్చన్న ఆశాభావం వ్యక్తం అవుతోంది,