ప్రతి నటుడి జీవితంలో ఎత్తుపల్లాలు వుంటాయి, హిట్లు ఫ్లాపులు వుంటాయి. కొన్ని పాత్రలు రక్తికడతాయి. ఇంకొన్ని పాత్రలు తేలిపోతాయి. బ్రహ్మానందం కూడా ఈ ఎత్తుపల్లాలు చూశారు. ఇక బ్రహ్మానందం పనైపోయిందని మాట్లాడుకున్న సందర్భాలు కూడా వున్నాయి. ఫాం కోల్పోయిన బ్యాట్స్ మెన్స్ మళ్ళీ తన బ్యాట్ తోనే సమాధానం చెప్పినట్లు.. బ్రహ్మానందం తన కామెడీతోనే బదులు చెప్పారు. బ్రహ్మానందం హవా తగ్గుతుందనుకునే తరుణంలో శ్రీనువైట్ల దర్శకత్వంలో వచ్చిన చిత్రాలలో విజ్రుభించారు బ్రహ్మానందం.
గజాల( వెంకీ) మెక్ డోనాల్ మూర్తి (రెడీ) జయసూర్య( కింగ్) చారి( ఢీ) రాంకీ( దుబాయ్ శీను) పద్మశ్రీ( దూకుడు) పద్మనాభ సింహ( బాద్షా) ఈ పాత్రలన్నీ ప్రేక్షకుల మనసులో నాటుకుపోయాయి. ఇక త్రివిక్రమ్ రాసిన, తీసిన సినిమాల్లో కూడా బ్రహ్మానందంకు స్పెషల్ ప్లేస్ వుంది. నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి, అతడు, అత్తారింటికి దారేది, జల్సా చిత్రాల్లో ఆయన పంచిన హాస్యం ఎవర్ గ్రీన్. వివి వినాయక్ తో చేసిన కృష్ణ, అదుర్స్, నాయక్ చిత్రాలు కూడా ప్రేక్షకులని నవ్వుల్లో ముంచెత్తాయి. ఇప్పుడు సోషల్ మీడియా తెరిస్తే చాలు పైన పేర్కొన్న సినిమాల్లోని ఎక్స్ ప్రెషన్స్ మీమ్స్ గా వైరల్ అవుతుంటాయి. తన పనైపొయిందనే విమర్శ తెరపైకి వచ్చి ప్రతిసారి బ్యాట్స్ మెన్ సెంచరీ కొట్టినట్లు ఓ ఐకానిక్ పాత్రతో అలరించేశారు బ్రహ్మి. అలాగని బ్రహ్మానందం ఇలాంటి పాత్రలకే పరిమితం అయిపోలేదు. తన సినీ జీవితం లో కొన్ని సీరియస్ పాత్రలు కూడా చేశారు. అమ్మ, నాన్న గారు, బాబాయ్ హోటల్.. మొన్నటికి మొన్న రంగ మార్తండ చిత్రాల్లో సీరియస్ పాత్రలతో సైతం అలరించారు బ్రహ్మానందం.
( ఈరోజు బ్రహ్మానందం పుట్టినరోజు)