కాకినాడ నుంచి వైసీపీ సమన్వయకర్తగా నియమితులైన చలమలశెట్టి సునీల్ రాజకీయాల్లో దురదృష్టవంతుడు. గత మూడు ఎన్నికల్లో ఆయన కాకినాడ నుంచి పోటీ చేశారు. మూడు సార్లు వేర్వేరు పార్టీల నుంచి పోటీ చేశారు. మూడు సార్లు ఓడిపోయారు ఇప్పుడు మరోసారి కాకినాడలో వైసీపీకి చాలా కష్టం అని అనుకుంటున్న సమయంలో మళ్లీ ఆయన కాకినాడ సమన్వయకర్తగా నియమితులయ్యారు.
వైసీపీ ప్రభుత్వంలో భారీగా లబ్ది పొందిన కంపెనీల్లో ఒకటిగా పేరొందిన గ్రీన్ కో వ్యాపార సంస్థ చలమలశెట్టి కుటుంబానిదే. డబ్బుకు లోటు లేని ఈ కుటుంబం నుంచి సునీల్ ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. 2009లో కాకినాడ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత వైసీపీలో చేరారు. 2014లో వైసీపీ తరపున పోటీ చేశారు. కానీ మళ్లీ ఓడిపోయారు. రెండు సార్లు పెద్ద తేడా ఏమీ లేదు. ఓ సారి ముఫ్ఫై వేలు.. మరోసారి మూడు వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. తర్వాత అధికార పార్టీ టీడీపీలో చేరారు. 2019 లో ఆ పార్టీ తరపున పోటీ చేశారు. కానీ జనసేన పార్టీ ఓట్లు చీల్చడంతో పాతిక వేల ఓట్ల తేడాతో మళ్లీ ఓడిపోయారు.
వైసీపీ అధికారంలోకి రావడంతో మళ్లీ ఆ పార్టీలో చేరిపోయారు. నిజానికి సునీల్ కు జనసేన తరపున పోటీ చేయాలన్న ఆసక్తి ఉంది. టీడీపీ మద్దతుతో సులువుగా గెలుస్తానని ఆయన అనుకున్నారు. కానీ వ్యాపార అవసరాలు… ఇతర కమిట్మెంట్ల కారణంగా ఆయన వైసీపీ తరపునే పోటీ చేయాల్సి వస్తోంది. కాకినాడ లోక్‌సభ సీటును జనసేన పార్టీ సాన సతీష్ కుమార్ కు కేటాయించినట్లుగా తెలుస్తోంది. నాలుగోసారి సునీల్‌కు దురదృష్టమే వెంటాడుతుందని.. అదే పనిగా పార్టీలు మారడం వల్ల ఆయనపై వరుసగా ఓడిపోతున్న సానుభూతి కూడా లేదన్న చర్చ జరుగుతోంది.