అమిత్ షాతో భేటీ అయ్యేందుకు జగన్ రెడ్డి ఢిల్లీ వెళ్లేందుకు గుమ్మం వద్ద రెడీగా ఉన్నారు. అపాయింట్ మెంట్ ఖరారయిందని తెలియగానే.. గన్నవరంలో పార్క్ చేసి ఉన్న ప్రత్యేక విమానంలో బయలుదేరడం ఖాయమే. కానీ అక్కడ్నుంచి సమాచారం రావడం లేదు. అయితే ఈ లోపు ఆయనకు పోటీగా షర్మిల కూడా ఢిల్లీలో దిగిపోతున్నారు. ఆమె నేరుగా ప్రధానితో పాటు అమిత్ షాను కలిసే ఆలోచనలో ఉన్నారని చెబుతున్నారు.
ఇద్దరి అపాయింంట్మెంట్ అడిగారని.. భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. షర్మిల నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రత్యేకహోదా కోసం జంతర్ మంతర్లో శుక్రవారం దీక్ష చేస్తారు. అంతకు ముందే… మోదీ, షాలతో సమావేశమై.. ఇదే అంశంపై వినతి పత్రం ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. కారణం బయటకు చెబుతున్నది ఇదే అయినా.. జగన్ రెడ్డికి ఎలాంటి సాయం చేయవద్దని ఆయన కుటుంబాన్ని ఎలా మోసం చేశాడో వివరించేందుకు షర్మిల వెళ్తున్నారని అంటున్నారు.
వచ్చే ఎన్నికల్లో బీజేపీ నుంచి సహకారాన్ని జగన్ రెడ్డి కోరుకుంటున్నారు. ఇటీవల ఎన్నికల సంఘం కాస్త కఠినంగా వ్యవహరిస్తోంది. షెడ్యూల్ ప్రకటన తర్వాత విశ్వరూపం చూపిస్తుందని.. జగన్ సర్వీస్ అధికారుల్ని శంకరగిరి మాన్యాలు పట్టించేందుకు జాబితా రెడీ చేసుకుందన్న ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో బీజేపీ సహకారం లేకపోతే పూర్తిగా అన్యాయమైపోతామన్న ఉద్దేశంతో జగన్ రెడ్డి బ బీజేపీకి తాయిలాలు ప్రకటించేందుకు వెళ్తున్నారని అంటున్నారు. అయితే ఈ సారి బీజేపీ ఎంటర్టెయిన్ చేస్తుందా లేదా అన్నది సందేహంగా మారింది.