సీఎం రేవంత్ రెడ్డితో ఎమ్మెల్యేలు వరుసగా మర్యాదపూర్వక భేటీలు నిర్వహిస్తూండటంపై కేసీఆర్ కోపం వ్యక్తం చేయలేక.. అలా కలిసిన వారి తప్పేమీ లేదన్నట్లుగా బుజ్జగించి కొన్ని సలహాలిచ్చారు. తుంటి గాయం నుంచి కోలుకున్న కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి.. ప్రతిపక్ష నేతగా బాధ్యతుల స్వీకరించారు. ఆ తర్వాత ఎమ్మెల్యేలతో తన ఇంట్లో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యేలపై కేసీఆర్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు జాగ్రత్తగా ఉండాలని.. ఏదో చెబితే విని ట్రాప్లో పడొద్దని సూచించారు. మీరు మంచి ఆలోచనతో ప్రభుత్వంలోని వారిని కలిసినా ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయన్నారు. అభివృద్ధి కోసం మంత్రులకు వినతి పత్రాలు ఇవ్వండి అదికూడా మంత్రులు జనం మధ్యలో ఉన్నప్పుడే ఇవ్వండని సూచించారు. సీక్రెట్ గా ఎవర్నీ కలవొద్దని.. వన్ టు వన్ భేటీలు రేవంత్ తో కానీ.. మంత్రులతో కానీ నిర్వహించవద్దని సూచించారు.
పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒకటి, రెండు సీట్లు కూడా రావని జరుగుతున్న ప్రచారంపై కేసీఆర్ వారికి ధైర్యం చెప్పారు. ఆరు నుంచి ఎనిమిది సీట్లు బీఆర్ఎస్ కు వస్తాయని సర్వేలు చెబుతున్నాయన్నారు. ధైర్యంగా ఎన్నికల బరిలో కొట్లాడాలన్నారు. బీఆర్ఎస్ ను బొందపెడతామని కాంగ్రెస్ నేతలు చేస్తున్న ప్రకటనల్ని ప్రజలు గమనిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యేలకు పార్టీ మారే ఉద్దేశం ఉన్నా లేకపోయినా.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరించేందుకు మాత్రం ఎక్కువ మంది సిద్ధంగా లేరు.
రేవంత్ తో సన్నిహిత సంబంధాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. వారిపై ఆగ్రహం వ్యక్తం చేసి అనుమానాలు పెంచుకుని.. వారిని ఇప్పుడే దూరం చేసుకోవడం కన్నా.. వారితో వీలైనంత సామరస్యంగా వ్యవహరించి . పార్టీలోనే ఉంచుకునే వ్యూహం అమలు చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు.