మేం చేస్తే కరెక్ట్.. అదే వేరే వారు చేస్తే తప్పు అన్నట్లుగా సిద్దాంతాలను వాదించడానికి రాజకీయ పార్టీలు రెడీగా ఉంటాయి. ఆయా పార్టీల మద్దతుదారులు ఇలా తమకు అనుకూలమైన అంశాలతో సోషల్ మీడియాలోకి వచ్చేస్తూంటారు. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ మీద అలాంటి దాడికి వచ్చేస్తున్నారు కొంత మంది బీఆర్ఎస్ సపోర్టర్స్. దీనికి ఉదాహరణ కర్రి శ్రీరామ్ అనే జర్నలిస్టును సలహాదారుగా నియమించడంపై చేస్తున్న విమర్శలే.
బీఆర్ఎస్ సర్కార్‌లో ఆంధ్రా జర్నలిస్టులకు పదవులు ఇవ్వలేదా ?
కర్రి శ్రీరామ్ అనే జర్నలిస్టును రేవంత్ రెడ్డి మీడియా సలహాదారుగా నియమించుకున్నారు. ఆయన చరిత్రను తవ్వేసిన బీఆర్ఎస్ మద్దతుదారులు ఆయన ఏపీకి చెందిన వారని.. ఆయన గతంలో ఉద్యమ సమయంలో ఉద్యమకారులపై నిందలు వేశారని.. ఇలాంటి వారినా రేవంత్ రెడ్డి అందలమెక్కించేది అని విమర్శలు చేస్తున్నారు. కానీ వీరే.. తమ తెలంగాణ సర్కార్ లోనూ ఆంధ్రా జర్నలిస్టులు కీలక పాత్ర పోషించారని.. ఒప్పుకోరు. అంత వరకూ టీ న్యూస్ చానల్‌కు నిన్నామొన్నటి వరకూ ఫక్తు ఆంధ్రా జర్నలిస్టు సీఈవోగా ఉన్నారు. బీఆర్ఎస్ సర్కార్‌లో ఆంధ్రా ప్రాధాన్యం.. ఉద్యమంపై దాడి చేసిన వారి గురించి ప్రస్తావించాల్సి వస్తే ఓ పుస్తకం రాసుకోవచ్చు. అది రాజకీయంగా అయినా నామినేటెడ్ పదవుల్లో అయినా… కాంట్రాక్టులు విషయంలో అయినా సరే.
ఏపీ జనం మీద విషం చిమ్మిన దేవులపల్లి అమర్ ఏపీ ప్రభుత్వంలో సలహాదారు కాదా ?
ఒక్క జర్నలిజం విషయానికి వస్తే.. దేవులపల్లి అమర్ అనే పెద్ద మనిషి ఇప్పటికీ ఏపీ సర్కార్ లో సలహాదారుగా ఉన్నారు. ఆయన హైదరాబాద్ లో కూర్చుని నెలకు ఐదు లక్షల వరకూ ఏపీ ప్రజల సొమ్మును తీసుకుంటున్నారు. ఆయన ఎవరు ?. తెలంగాణ ఉద్యమకారుడు. జర్నలిస్టు పేరుతో ఉద్యమం సమయంలో ఆంధ్రా ప్రజలకు విషం చిమ్మిన ఉద్యమకారుడు. ఆయనకు ఏపీ లో జగన్ రెడ్డి సర్కార్ రాగానే ప్రజాధనం దోచి పెట్టేలా సలాహాదారు పదవి ఇచ్చారు. తమ తెలంగాణ ఉద్యమకారుడు… తాము జీవితాంతం ద్వేషించిన ఏపీ ప్రజల పన్నుల సొమ్మును జీతంగా తీసుకోవడమేంటి అని మాత్రం ఒక్కరూ ప్రశ్నించలేదు. ఏపీలో వాళ్లూ ప్రశ్నించలేదు.. కానీ ఇప్పుడు శ్రీరామ్ కర్రి అనే జర్నలిస్టును సలహాదారుగా నియమించుకుంటే మాత్రం.. తెలంగాణ ప్రభుత్వం లో ఏపీ వారికి ప్రాధాన్యం అంటూ రెచ్చిపోతున్నారు.
ఇంకా ఈ విద్వేషాలు ఎందుకు ?
బీఆర్ఎస్ సర్కార్ లో ఆంధ్రా వారికే ప్రాధాన్యం లభించిందనేది… బీఆర్ఎస్ నేతల్లో కూడా ఎక్కువగా వినిపించిన కంప్లైంట్. ఉద్యమపార్టీలో అలా జరగడం.. విచిత్రమే. అయితే ఇక్కడ పట్టుబట్టి ఆంధ్రా వారినే ఎంపిక చేసుకోవాలని ఎవరూ అనుకోరు. రేవంత్ రెడ్డికి ఆ జర్నలిస్టుతో అనుబంధం ఉండి ఉంటుంది. తన అభిప్రాయాలు, భావనలు ఆయన మీడియాకు సరిగ్గా వెల్లడిస్తారని అనుకుని ఉంటారు. అందుకే నియమించుకుని ఉంటారు. దానికే లేనిపోని రాద్దాంతం చేస్తే.. దాన్నే హిపోక్రసీ అంటారు. కడపు మంట అని కూడా అనొచ్చు.