ఐదు జాబితాలను సజ్జల రామకృష్ణారెడ్డి, జగన్ రెడ్డి కలిసి ప్రిపేర్ చేయిస్తే ప్రకటించడానికి మాత్రం బొత్సను పిలిపించేవారు. బొత్స తో పేర్లు ప్రకటించి.. పక్కన సజ్జల నిలబడేవారు. ఆరో జాబితాకు మాత్రం బొత్స రాలేదు. మెరుగు నాగార్జునతో ప్రకటింప చేశారు. అలా ప్రకటన చేసి వెళ్లిన వెంటనే.. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాకు ఇంచార్జుగా ఉన్న బొత్స పదవిని పీకేసినట్లుగా ప్రకటన వచ్చింది. వైవీ సుబ్బారెడ్డికే ఆ జిల్లాల బాధ్యతలు ఇచ్చారు. కానీ డిప్యూటీ ఇంచార్జ్ అంటూ బొత్స మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావుకు బాధ్యతలిచ్చారు.
బొత్స సత్యనారాయణ ఒక్క సారిగా ఎందుకు కనిపించలేదన్నది వైసీపీలోనూ చర్చనీయాంశమవుతోంది. బొత్స సతీమణికి విశాఖ పార్లమెంట్ సీటు ఇస్తున్నట్లుగా ప్రకంటించారు. కానీ అదంతా ఉత్తుత్తిదేనని ఆమెకు ఫైనల్ గా టిక్కెట్ ఇవ్వరని అందరూ నమ్ముతున్నారు. మజ్జి శ్రీనివాస్ కు విజయనగరం లోక్ సభ టిక్కెట్ పై తేల్చడం లేదు. చివరికి బొత్స సత్యనారాయణకు కూడా చీపురుపల్లిలో టిక్కెట్ ఇవ్వబోవడం లేదని.. బెల్లాన చంద్రశేఖర్ కు ఇస్తున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. బొత్సను వ్యూహాత్మకంగా నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఆనుమానాలు క్రమంగా బలపడుతున్నాయి.
మరో వైపు ఉత్తరాంధ్రలోనే కాదు.. విజయనగరంలో కూడా బొత్స మాటలు చెల్లడం లేదు. చివరికి మంత్రిగా తన శాఖలో ఏం జరుగుతుందో కూడా తనకు తెలియడం లేదు. ఈ పరిణామాలతో బొత్స అసహనానికి గురవుతున్నారని అంటున్నారు. ఇటీవల ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకున్నారు. ఈ ఒత్తిళ్లను భరించడం కష్టమని సైలెంట్ గా ఉండాలని అనుకుంటున్నట్లుగా చెబుతున్నారు. కారణం ఏదైనా బొత్సను తీవ్ర ఒత్తిడిలో పడేస్తున్నారని అంటున్నారు.