పోలీసులు అంటే నేరస్తులకు భయం… సామాన్యులకు అభయం ఉండాలి. కానీ పాలకుడ్ని బట్టే పోలీసులు కూడా. నేరాలు, ఘోరాలకు పాల్పడటం మన హక్కు అనుకునే పాలకుడి చేతిలో పడిన పోలీసు వ్యవస్థ ఇప్పుడు అత్యంత ఘోరంగా ప్రజల ముందు నిలబడింది. వారిని చూస్తే… దొంగలని.. దోపిడీదారులని.. హంతకులకు రక్షణంగా ఉండేవారని.. బాధితులపై కేసులు పెట్టే వారని అనుకునే పరిస్థితి వచ్చింది. ఇంత కంటే పోలీసు వ్యవస్థను ఎవరు దిగజార్చగలరు.
డీజీ స్థాయి అధికారి దగ్గర నుంచి అందరూ అరాచకశక్తులే !
సొంత డిపార్టుమెంట్ లో ఉన్నత ఉద్యోగిని ఇరికించడానికి స్వయంగా డీజీపీ స్థానంలో ఉన్న సవాంగ్ ఓ సంతకాన్ని ఫోర్జరీ చేశారన్న ఆరోపణలు వచ్చాయి. ఆయనే అప్పట్లో బాస్ కాబట్టి ఇందులో నిజం బయటకు రాదు. కానీ వాస్తవాలను ఎవరూ తుడిచేయలేరు. ప్రభుత్వం మారగానే మొత్తం బయటకు వస్తుంది. కానీ డిపార్టుమెంట్ లో అందరికీ తెలుసు. సాక్షాత్తూ డీజీపీనే ఫోర్జరీ చేశారంటే ఇక కింది స్థాయి వారి మైండ్ సెట్ ఎలా మారుతుంది..? మారింది కూడా . ఇప్పుడు పోలీసులు గంజాయి ముఠాల్లో ఉన్నారు.. కిడ్నాప్ ముఠాల్లో ఉన్నారు. అక్రమ మద్యం దందాల్లో ఉన్నారు. హత్యలు.. అత్యాచారాలు వంటి అసాఘిక నేరాల్లోనే ఉన్నారు. ఎంత ఘోరమంటే.. ఇటీవల ఓ డీజీ స్థాయి అధికారి తనపై ప్రమోషన్లు రాకుండా కుట్ర చేస్తున్నారని తప్పుడు కేసుల్లో అరెస్టు చేసే ప్రయత్నమని కోర్టుకెళ్లి ముందస్తు బెయిల్ తెచ్చుకోవాల్సి వచ్చింది.
చంబల్ కిడ్నాప్ ముఠాల కన్నా ఘోరం ఏపీ సీఐడీ !
ఒకప్పుడు చంబల్ ముఠాలంటే భయంతో వణికిపోయేవారు. ఇప్పుడు ఏపీ సీఐడీ అంటే అలా వణికిపోతున్నారు. ఏపీ సీఐడీ పేరుతో ఏకంగా సాఫ్ట్ వేర్ కంపెనీ ఓనర్ ను కిడ్నాప్ చేశారు. చేసింది కూడా ఎస్ఐనే. ఇది బయట పడింది. బయటపడని ఎన్ని కిడ్నాప్ లు జరిగాయో.. ఎన్ని కోట్ల దందాలు చేశారో ఎవరికి తెలుసు. విశాఖలో ల్యాండ్ సెటిల్మెంట్ చేయడానికి అప్పటి సీఐడీ బాస్ ప్రయత్నించారన్న ఆరోపణలు వచ్చాయి. చిన్న చిన్న సోషల్ మీడియా కేసుల్లో అర్థరాత్రి ఇళ్లపై పడటం… రాజకీయ బాసుల ప్రత్యర్థుల్ని అరెస్టులు చేయడం…. ఇలాంటి వాటితే ఏపీ సీఐడీ చంబల్ ముఠాల్ని మించిపోయింది.
పట్టపగలే అరాచకాలు – స్పందన లేని పోలీసులు
పర్చూరులో మైనింగ్ అధికారుల పేరుతో క్వారీలపై రౌడీలు దాటి చేస్తే క్వారీ యజమానులపై కేసులు పెట్టారు. క్రోసూరులో ఎమ్మెల్యే కొడుకు వీరంగం చేస్తే పోలీసులు సపోర్టుగా నిలిచారు. టీడీపీ ఆఫీసుపై దాడి చేస్తే కేసు లేదు.. పట్టాభిరాం ఇంటిపై దాడి చేస్తే కేసులు లేవు. చంద్రబాబుపై లెక్కలేనన్ని హత్యాయత్నాలు చేస్తే… కేసులు లేవు. కానీ వందల కేసుల్లో బాధితులపై కేసులు పెట్టారు. బాధితుల్నే నిందితులుగా చేర్చారు. కళ్ల ముందు కనిపించిన వాస్తవాలు ఉన్నా.. బాధితుల్నే బందించారు. ఇదా పోలీసు వ్యవస్థ ? ఇదా వ్యవస్థను కాపాడే విధానం ?. ఇదా ప్రజల సొమ్ము జీతాలుగా తీసుకుంటూ ప్రజలకు చేసే సేవ ?
ప్రస్తుత సీఎం జగన్ రెడ్డి తనకు పోలీసులపై నమ్మకం లేదని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పేవారు. ఆయన సీఎం అయి పోలీసుల్ని ప్రజలు ఎవరూ నమ్మకుండా చేయడమే కాదు.. వారే పెద్ద దొంగలు అని కీర్తి ఇచ్చేశారు. దానికి ఆ వ్యవస్థలో పెద్దలే బాధ్యత వహించాలి.