జనసేన, టీడీపీ పొత్తుతో షేకైపోతున్న జగన్ రెడ్డి అభ్యర్తుల ఎంపిక పేరుతో చేస్తున్న సర్కస్.. ఆ పార్టీ తరపున పోటీ చేయడానికి కూడా వెనుకాడుతున్న నేతలు కళ్ల ముందు కనిపిస్తూంటే.. ఆయన శ్రేయోభిలాషి ఉండవల్లి అరుణ్ కుమార్ మాత్రం.. అబ్బే లాంటిదేమీ లేదని కవర్ చేసేందుకు మీడియా ముందుకు వచ్చారు. టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకుంటే మామూలుగా షేకైపోవాలి కానీ జగన్ రెడ్డి భయం లేదని కవర్ చేసేందుకు రాజమండ్రిలో మీడియా సమావేశం పెట్టారు.
రాష్ట్రంలో అర్బన్ ఏరియాల్లో జగన్ మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఓట్లు కనపడుతున్నాయని ఉండవల్లి జోస్యం చెప్పారు. వైసీపీ కంటే ఎక్కువగా ఇస్తామంటూ టీడీపీ మేనిఫెస్టో ప్రకటిస్తున్నారని, వీటన్నింటిని ప్రజలకు అందించడం ఎలా సాధ్యమనే విషయాలను ఒకసారి పరిశీలన చేసుకోవాలని ఉండవల్లి అన్నారు. చదువుకున్నవారు రోడ్లు బాలేదనో, ఇంకేదో లేదనో వైసిపికి వ్యతిరేకం అవ్వొచ్చు. రూరల్లో మాత్రం వైసిపికి పాజిటివ్ గా ఉందని చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో జగన్ 40%, చంద్రబాబుకు 40% ఓట్ పర్సంటేజ్ వస్తాయనుకుంటున్నానని చెప్పుకొచ్చారు. గత ఎన్నికలలో జనసేనకు 6% ఓట్ షేర్ రాగా, ఈ సారి పెరుగుతుందని చెప్పారు.
సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎన్ని రకాల తప్పులు చేయకూడదో అన్నిరకాల తప్పులు చేసుకుంటూ పోతున్నాడని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. 175 స్థానాల్లో జగన్ తరపున కాదు.. జగనే పోటీ చేస్తున్నారని ఉండవల్లి సెటైర్ వేశారు. ఉండవల్లి జగన్ కు ప్రతీ సారి ఏదో ఓ సందేశం పంపిద్దామనుకుంటారు కానీ ఆయన తీసుకుంటారో లేదో ఎవరికీ అర్థం కాదు.. కానీ వైఎస్ పుత్రుడన్న అభిమానంతో మాత్రం.. ఆయన రాష్ట్రం గురించి కూడా ఆలోచించకుండా సలహాలిస్తూనే ఉంటారు.
టీడీపీ ఉన్నప్పుడు పోలవరం, మద్యం అంటూ ఇష్టారీతిన ప్రెస్ మీట్లు పెట్టేవారు. ఇప్పుడు రాజమండ్రిలోనూ ఇసుక దొరకడం లేదని ఆయన చెబుతారు కానీ.. జగన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడరు. అవసరమైతే ఆయనకు సపోర్టు చేయడానికి లాయర్ తెలివితేటలతో లాజిక్కులతో మాత్రం వస్తారు.