విశాఖ టెస్ట్ లో భారత్ ఇంగ్లండ్ పై 144 పరుగుల భారీ ఆధిక్యాన్ని సంపాదించుకొంది. తొలి ఇన్నింగ్స్ లో వంద పైచిలుకు ఆధిక్యం వస్తే దాదాపుగా గెలుపు ముంగిట ఉన్నట్టే. కానీ తొలి టెస్ట్ చేదు జ్ఞాపకాలు ఇంకా కళ్ల ముందు కదలాడుతూనే ఉన్నాయి. హైదరాబాద్‌లో భారత్ తొలి ఇన్నింగ్స్ లో ఏకంగా 190 పరుగుల ఆధిక్యం సంపాదించింది. కానీ ఆ మ్యాచ్‌లో భారత్ అనూహ్యంగా ఓడిపోయింది. ఈసారీ అలాంటి పరిణామాలే ఎదురవుతాయా? ఇంగ్లండ్ సెకండ్ ఇన్నింగ్స్‌లో పుంజుకొంటుందా? అనే అనుమానాలు వెంటాడుతున్నాయి.
అయితే హైదరాబాద్ టెస్ట్ నీ, విశాఖ టెస్ట్ నీ పోల్చి చూసుకోవడానికి వీల్లేదు. హైదరాబాద్ లో భారత్ టార్గెట్ ని ఛేజ్ చేసింది. ఇక్కడ ఇంగ్లండ్ ముందు టార్గెట్ ఫిక్స్ చేసే అవకాశం ఉంది. స్పిన్ పిచ్‌లపై నాలుగో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేయడం అంత సులభం కాదు. భారత్ చేతిలో ఇప్పుడు 160 పైచిలుకుల ఆధిక్యం ఉంది. మూడోరోజు మొత్తం బ్యాటింగ్ చేస్తే కనీసం మరో 300 పరుగులు జోడించొచ్చు. అంటే.. 450 పరుగుల టార్గెట్ అన్నమాట. నాలుగో ఇన్నింగ్స్‌లో ఇది అతి పెద్ద ఛేదన అవుతుంది. ఈ లెక్కల ప్రకారం ఈ మ్యాచ్ భారత్ చేతిలోకి వచ్చేసినట్టే. కాకపోతే.. పిచ్ ఇప్పటికీ బ్యాటింగ్ కి అనుకూలంగా ఉంది. ఫాస్ట్ బౌలర్లకు కూడా సహకరిస్తుంది. రెండో ఇన్నింగ్స్ లో భారత బ్యాటర్లు మరీ పేలవంగా అవుట్ అయిపోతే తప్ప.. ఈ మ్యాచ్ మన చేతుల్లోంచి జారదు.