విశాఖలో శాంతిభద్రతల పరిస్థితులపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఓ మెజిస్ట్రేట్ స్థాయి అధికారి అయిన ఎమ్మార్వోపై దుండగులు ఇంటి దగ్గరే దాడి చేసి హత్య చేసి నింపాదిగా వెళ్లిపోయారు. పోలీసులు వారిని పట్టుకోలేదు సరి కదా.. ప్రెస్ మీట్ పెట్టి వారెవరో గుర్తించాం.. కానీ అందరికీ తెలిసిపోతుందని చెప్పడం లేదు లాంటి కబుర్లు చెబుతున్నారు. హత్య చేసిన తర్వాత ఎయిర్ పోర్టుకు వెళ్లి ఫ్లైట్ కూడా ఎక్కారన్న అనుమానాల్ని పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. అంటే ఎంత పెద్ద ప్రణాళిక ప్రకారం హత్య చేశారో అర్థం చేసుకోవచ్చన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
విశాఖలో కొద్ది రోజుల కిందట ఎంపీ సత్యనారాయణ కుటుంబాన్ని కిడ్నాప్ చేశారు. రెండు రోజులు అధీనంలో ఉంచుకున్నారు. ఈ అంశం సంచలనాత్మకం అయింది. కనీసం నిందితుల్ని కూడా మీడియా ముందుకు ప్రవేశ పెట్టలేదు. ఏవో పిట్టకథలు మాత్రం పోలీసులు చెప్పారు. తర్వాత సాక్షి పత్రికలో పెద్ద ఎత్తున ప్రకటనలు ఇచ్చిన ఎంపీ.. అసలు కథ అంతా ఎక్కడ నుంచి జరిగిందో హింట్ ఇచ్చినంత పని చేశారు. ఇప్పుడు ఎమ్మార్వో హత్య పైన కూడా అలాంటి అనుమానాలే వ్యక్తమవుతున్నాయి.
వైజాగ్ , ఉత్తరాంధ్ర అంతా వైసీపీకి చెందిన కబ్జా, ఖూనీకోర్ల ముఠాలు ఆక్రమించాయని.. భూ దందాలు చేస్తూ.. అడ్డొచ్చిన వారిపై హత్యకలకూ తెగబడుతున్నాయని ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి. నేడు స్వయంగా ఓ తహసీల్దార్ నే హత్య చేస్తే దిక్కు లేకుండా పోయింది. భూవివాదాల వల్లేనని పోలీసులు కూడా చెబుతున్నారు. అత్యంత ప్రశాంతంగా ఉండే విశాఖలో ఈ ఐదేళ్లలో ఇలాంటి అరాచకాలకు కొదవే లేదు. ఇప్పుడు ఇది బహిరంగ హత్యల వరకూ వచ్చింది. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నేరస్తుల గుప్పిట చిక్కిన విశాఖను చూసి విలవిల్లాడుతున్నారు.